రేవంత్ రెడ్డికి పదవి భయం – కేటీఆర్

  • కాంగ్రెస్‌కు బుద్ధి చెబితేనే హామీలు అమలు అవుతాయి!
  • 420 హామీలు అమలు కావాలంటే కాంగ్రెస్‌కి బుద్ధి చెప్పాల్సిందే!
  • రేవంత్ రెడ్డి సీటుకే గ్యారంటీ లేదు!
  • కాంగ్రెస్ దిగజారిపోయింది!
  • ప్రజా సమస్యలను గాలికొదిలేశారు.
  • ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే ఇన్ని కష్టాలు!
  • కుటుంబ విలువల గురించి మాట్లాడే అర్హత రేవంత్‌కి లేదు!
  • గెలిపిస్తే గల్లా పట్టుకుని ప్రశ్నిస్తాం!

హైదరాబాద్ (ఆంధ్రప్రభ): జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఓ టీవీ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

కేటీఆర్ మాట్లాడుతూ, జూబ్లీహిల్స్ బైపోల్ కోసం సీఎం, మంత్రులు తిరగడంపై మండిపడ్డారు. కాంగ్రెస్ కు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే ప్రజలకు ఇన్ని క‌ష్టాలు వచ్చాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి సీటుకే గ్యారంటీ లేదు అంటూ ఎద్దేవా చేశారు.

“బైపోల్ కోసం రేవంత్ రెడ్డి దిగజారిపోయాడు… మ‌రి ప్రజల సమస్యల కోసం ఎందుకు తిర‌గ‌డం లేదు?” అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసిందని ఆరోపించారు. ఉప ఎన్నిక‌ల్లో ఏనాడు కేసీఆర్ ప్ర‌చారం చేయలేదని గుర్తుచేస్తూ, ప‌ద‌వి భయంతోనే రేవంత్ ప్ర‌చారం చేస్తున్నార‌ని ఎద్దేవా చేశారు.

జూబ్లీహిల్స్‌లోని 4 లక్షల మంది ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబితేనే, కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు అమలు అవుతాయని కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే, “ప్రభుత్వాన్ని గల్లా పట్టుకుని ప్రజల తరఫున మరింత బలంగా ప్రశ్నిస్తామని” ఆయన హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పొరపాటున గెలిస్తే, ఇళ్లను కూల్చి వేస్తూ, ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరిస్తారని విమర్శించారు.

ఈ సందర్భంగా కేటీఆర్.. రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. “కంటోన్మెంట్ నియోజకవర్గానికి రూ.4 వేల కోట్లు ఇచ్చినట్లు నిరూపిస్తే, తానే వెంటనే రాజీనామా చేస్తానని” ప్రకటించారు. రేవంత్ రెడ్డి కూడా అదే ధైర్యం చేయగలడా అని ప్రశ్నించారు.

కుటుంబం, విలువలపై రేవంత్ రెడ్డి మాట్లాడడం దరిద్రంగా ఉంటుందని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. PJR మీద ఇప్పుడు ప్రేమ చూపిస్తున్న రేవంత్ రెడ్డి, 2023 ఎన్నికల్లో ఆయన కుమారుడు విష్ణువర్ధన్‌కి టికెట్ ఇవ్వలేదని గుర్తు చేశారు. కంటోన్మెంట్‌లో గద్దర్ కూతురిని విస్మరించి గణేష్‌కి టికెట్ ఇచ్చింది కూడా రేవంతేనని అన్నారు. అంతేకాకుండా, రేవంత్ టీడీపీలో ఉన్నప్పుడు తన మామ జైపాల్ రెడ్డిను తిట్టాడని, ఇప్పుడు ప్రేమ నటిస్తున్నాడని అన్నారు.

కాంగ్రెస్, బీజేపీ ‘అక్రమ సంబంధం’

కాంగ్రెస్, బీజేపీ మధ్య అక్రమ సంబంధం ఉన్నదని కేటీఆర్ అన్నారు. “ఢిల్లీకి మూటలు పంపడానికి డబ్బులు ఉన్నాయ్ కానీ ప్రజలకు ఇవ్వడానికి లేవా? ఇంత దుర్మార్గమా?” అంటూ రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. మొన్న మహారాష్ట్ర, హర్యానా, ఇప్పుడు బీహార్ ఎన్నికలకు కూడా డబ్బులు పంపిస్తున్నది రేవంత్ రెడ్డేనని కేటీఆర్ తీవ్ర ఆరోపణ చేశారు.

Leave a Reply