ఈనెల 7న పల్లగుట్టలో బహిరంగ సభ

ఈనెల 7న పల్లగుట్టలో బహిరంగ సభ
- ఎమ్మెల్యే కడియం శ్రీహరి
చిల్పూర్, ఆంధ్రప్రభ: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈనెల 7వ తేదీన స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా దాదాపు రూ.50 కోట్ల విలువైన విద్యుత్ సబ్‌స్టేషన్ల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నట్లు మాజీ ఉప ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి వెల్లడించారు. సోమవారం చిల్పూర్ మండలం పల్లగుట్ట వద్ద భారీ బహిరంగ సభ కోసం కేటాయించిన స్థలాన్ని అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు.
నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా పలు మండలాల్లో నిర్మించిన సబ్‌స్టేషన్లను డిప్యూటీ సీఎం ప్రారంభించనున్నారు. వేలేరు మండలం పీచరలో 132/33 కేవీ సబ్‌స్టేషన్, చిల్పూర్ మండలం కొండాపూర్, జఫర్‌గడ్ మండలం సాగరం, రఘునాథపల్లి మండలం కుర్చపల్లి గ్రామాల్లో 33/11 కేవీ సబ్‌స్టేషన్లను జాతికి అంకితం చేస్తారు. చిల్పూర్ మండలం లింగంపల్లి, పల్లగుట్ట, నష్కల్ గ్రామాల్లో కొత్తగా నిర్మించనున్న 33/11 కేవీ సబ్‌స్టేషన్లకు పునాది రాయి వేయనున్నారు.
ఈ పర్యటనలో భాగంగా చిల్పూర్ మండలం పల్లగుట్ట వద్ద సుమారు 5 వేల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సభా స్థలిని పరిశీలించిన వారిలో ఆర్డీవో వెంకన్న, చిల్పూర్ ఆలయ కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావుతో పాటు విద్యుత్, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు.
