28thJunechintana | నేటి సమాజానికి భాగవతం చెప్పే జీవన సందేశం
28thJunechintana | నేటి సమాజానికి భాగవతం చెప్పే జీవన సందేశం
28thJunechintana | భాగవత రసామృతం ఎందుకు ఆస్వాదించాలి?
పోతన భాగవతం గొప్పతనం
28thJunechintana | సాధారణంగా పుస్తకాలను ‘చదువుతాం’, కానీ భాగవతానికి వచ్చేసరికి ‘తాగడం’ (పిబత భాగవతం రసమాలయం) అనే పదాన్ని వాడతారు. ఎందుకంటే అది కేవలం అక్షరాల కూర్పు కాదు, భక్తి, రసంతో, నిండిన, అమృతం! పోతన తెనిగించిన భాగవతంలోని అమృతాన్ని ఆస్వాదించడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్షం, వామన చరితం, కృష్ణ లీలలు… ఇలా ప్రతి ఘట్టం మనసును భక్తితో, ప్రశాంతతతో నింపేస్తుంది. పోతన కురిపించిన పద్యాల అమృతధారలు వింటుంటేనే చెవులకు విందుగా ఉంటుంది. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా భగవంతుడిపై భారాన్ని ఎలా వేయాలో (గజేంద్ర మోక్షం) నేర్పే అద్భుతమైన జీవిత పాఠం ఇది. నిజంగానే భాగవత రసాన్ని ఆస్వాదించడం (తాగడం) అంటే పరమానందాన్ని అనుభవించడమే.
ఒక సాధారణ గ్రంథం మస్తిష్కానికి జ్ఞానాన్ని ఇస్తే, మహాభాగవతం హృదయానికి అమృతత్వాన్ని ఇస్తుంది. లౌకిక ప్రపంచంలోని ఆశాపాశాలు, బంధాలు, ఆందోళనల మధ్య నలిగిపోయే మానవ చేతనకు, భాగవత శ్రవణం లేదా పఠనం ఒక శీతల గంధలేపనంలా పనిచేస్తుంది. భాగవతం అంటే కేవలం ఒక దైవ గ్రంథం కాదు. అది మానవ పరిణామ క్రమానికి, అంతఃచేతన జాగృతికి దిక్సూచి. వ్యాస మహర్షి మహాభారతం వంటి బృహత్తర గ్రంథాన్ని రాసి, వేదాలను విభజించి కూడా మనశ్శాంతిని పొందలేకపోయారు. అప్పుడు నారద మహర్షి ఆజ్ఞతో, కేవలం భగవంతుని లీలలను, భక్తుల ఆర్తిని ఆవిష్కరిస్తూ ‘శ్రీమద్భాగవతాన్ని’ రచించిన తర్వాతే ఆయనకు సంపూర్ణమైన ఆత్మతృప్తి లభించింది. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు. లౌకిక జ్ఞానం వితండవాదానికి దారితీయవచ్చు, కానీ భాగవత రసం ఆత్మకు ప్రశాంతతను ఇస్తుంది.
సంస్కృతంలో వ్యాసుడు అందించిన భాగవతానికి, సహజ పండితుడు బమ్మెర పోతన తెలుగులో పోసిన ప్రాణం అద్వితీయం. పోతన గారి భాగవతం కేవలం అనువాదం కాదు. అది ఒక భక్తుడి హృదయ తరంగాల ఆవిష్కరణ. ‘పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుండట…’ అంటూ తన అహంకారాన్ని పూర్తిగా తుడిచిపెట్టుకుని కలం పట్టిన మహానుభావుడు ఆయన. రాజభోగాలను ఆశించక, దరిద్రాన్ని అనుభవిస్తూనే, భాగవతాన్ని ఏ రాజుకూ అంకితం ఇవ్వనని తెగేసి చెప్పిన పోతన గారి నైతికత, భాగవతంలోని ప్రతి పద్యంలోనూ ప్రతిబింబిస్తుంది. అందుకే, ఆయన రాసిన ప్రతి అక్షరం ఒక మంత్రమై, తెలుగువారి నాలుకలపై అమృతంలా నర్తిస్తుంది.
భాగవతాన్ని ‘తాగడం’ అంటే, అందులోని పాత్రల అంతరంగాలను, వారు ఎదుర్కొన్న సంఘర్షణలను మన జీవితానికి అన్వయించుకోవడం. ఇందులో ప్రతి కథ ఒక పరమార్థాన్ని బోధిస్తుంది. సంసారమనే మడుగులో, కాలమనే మొసలి నోట చిక్కిన జీవుడు (గజేంద్రుడు) తన బలాన్ని, బంధువులను నమ్ముకుని విఫలమయ్యాడు. చివరకు, “లావొక్కింతయు లేదు…” అంటూ సర్వస్వ శరణాగతి వేడినప్పుడు భగవంతుడు పరుగున వచ్చాడు. ఇది మానవుడికి అహంకారాన్ని వీడి, భగవత్ తత్త్వానికి లొంగిపోవాలని నేర్పే అద్భుత ఘట్టం.
చుట్టూ ఉన్న ప్రపంచం, కన్న తండ్రే శత్రువుగా మారినా, పరమాత్మపై నమ్మకం కోల్పోని చిన్నారి ప్రహ్లాదుడి కథ. “ఇందు గలడందు లేడను సందేహము వలదు…” అనే పద్యం, దైవం అంతటా ఉన్నాడనే విశ్వాసానికి ప్రతీక. మన నమ్మకమే దైవాన్ని స్తంభం నుండి సైతం ఆవిష్కరింపజేస్తుందని దీని భావం.
బలి చక్రవర్తి అహంకారరహిత దానగుణాన్ని, అదే సమయంలో గురువు మాటను కూడా దాటి ధర్మానికి కట్టుబడిన తీరును చూపిస్తుంది. తనను తాను సమర్పించుకోవడమే నిజమైన దానం (ఆత్మనివేదనం) అని ఇది చాటుతుంది. పరమాత్మ జీవులతో జరిపే ప్రణయ లీలలు, గోపికల అనన్య భక్తి, లౌకిక బంధాలకు అతీతమైన దైవిక ప్రేమను రుచి చూపిస్తాయి.
ఆధునిక కాలంలో మానవుడు భౌతిక సంపదలను, సాంకేతిక విజయాన్ని సాధిస్తున్నాడు. కానీ, మానసిక ప్రశాంతతను కోల్పోతున్నాడు. నిరంతర ఒత్తిడి, అభద్రతా భావం, బంధాలలో పగుళ్లు నేటి మనిషిని వెంటాడుతున్నాయి. ఇలాంటి స్థితిలో భాగవతాన్ని “ఆస్వాదించడం” అత్యంత ఆవశ్యకం.
లాభనష్టాలకు, సుఖదుఃఖాలకు చలించని మనస్తత్వాన్ని అలవరచుకోవడం (స్థితప్రజ్ఞత), ఫలితాన్ని ఆశించకుండా మన బాధ్యతను ధర్మబద్ధంగా నిర్వహించడం (నిష్కామకర్మ), సకల జీవులలోనూ ఆ పరమాత్మను దర్శిస్తూ అందరి పట్ల కరుణ కలిగి ఉండటం (మానవీయత) నేటి సమాజానికి భాగవత రస ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.
భాగవతాన్ని కేవలం వృద్ధాప్యంలో చదివే పుస్తకంగా చూడటం మన పొరపాటు. యవ్వనంలో, జీవిత గమ్యాన్ని నిర్దేశించుకునే సమయంలోనే ఈ రసామృతాన్ని గ్రోలాలి. అది బుద్ధిని సన్మార్గంలో ఉంచుతుంది, హృదయాన్ని విశాలం చేస్తుంది. పోతన అందించిన ఆ తేటతెలుగు పద్యాల మాధుర్యాన్ని, భాగవతంలోని ఆధ్యాత్మిక తత్త్వాన్ని నిత్య జీవితంలో ఒక భాగంగా చేసుకుందాం. ఆ భక్తి రసాన్ని మనసారా తాగి, ప్రాపంచిక తాపాల నుండి విముక్తి పొంది, అంతర్గత ఆనందాన్ని అనుభవిద్దాం.
ఆనంద ‘మైత్రేయ’మ్
8008577834
