june28sunday2026|ఆంధ్రప్రభ ఆదివారం సంచిక

కుప్పకూలిన సినీ దిగ్గజం..

గుండెపోటుతో ప్రముఖ దర్శకుడు, నటుడు, రచయిత కన్నుమూత
తమిళ చిత్రసీమలో మరో తీవ్ర విషాదం
భారతీరాజా మరణించిన 17 రోజులకే ప్రియ శిష్యుడి మృతి
కోలీవుడ్, టాలీవుడ్‌లో విషాదఛాయలు

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్: తమిళ సినీ పరిశ్రమ వరుస విషాదాలతో శోకసంద్రంలో మునిగిపోయింది. ప్రముఖ దర్శకుడు భారతీరాజా మరణవార్త నుంచి ఇంకా కోలుకోకముందే… ఆయన ప్రియ శిష్యుడు, నటుడు, దర్శకుడు, కథా రచయిత, స్క్రీన్‌ప్లే నిపుణుడు కె. భాగ్యరాజ్ (73) శనివారం (జూన్ 27) గుండెపోటుతో కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసంలో అస్వస్థతకు గురైన ఆయనను వెంటనే గ్రీమ్స్ రోడ్డులోని అపోలో ఆసుపత్రికి తరలించగా… అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

భాగ్యరాజ్ మరణంతో తమిళ సినీ పరిశ్రమ ఒక గొప్ప కథకుడిని, వినూత్న దర్శకుడిని, సహజ నటుడిని కోల్పోయిందనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా కేవలం 17 రోజుల క్రితమే తన గురువు భారతీరాజా కన్నుమూయగా… ఇప్పుడు ఆయన తొలి శిష్యుడైన భాగ్యరాజ్ కూడా తుదిశ్వాస విడవడం కోలీవుడ్‌ను మరింత విషాదంలోకి నెట్టింది. గురువు-శిష్యులిద్దరూ స్వల్ప వ్యవధిలోనే ఈ లోకాన్ని విడిచిపెట్టడం సినీ అభిమానులను తీవ్రంగా కలచివేస్తోంది.

‘స్క్రీన్‌ప్లే కింగ్’గా చెరగని ముద్ర

పూర్తి పేరు కృష్ణస్వామి భాగ్యరాజ్. దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో ఆయనను అభిమానులు, సినీ విమర్శకులు ప్రేమగా ‘స్క్రీన్‌ప్లే కింగ్’ అని పిలిచేవారు. కథను ఆసక్తికరంగా అల్లడంలో, సాధారణ సంఘటనలను హృదయాలను హత్తుకునే భావోద్వేగాలతో మేళవించడంలో ఆయనకు అసాధారణ ప్రతిభ ఉండేది.

దర్శకుడిగా, కథా రచయితగా, సంభాషణల రచయితగా, నటుడిగా, నిర్మాతగా, సంగీత దర్శకుడిగా, సంపాదకుడిగా తన బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన సినీ ప్రయాణంలో 75కు పైగా చిత్రాల్లో నటించి, 25కు పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు.

భారతీరాజా శిష్యుడిగా ప్రారంభమైన ప్రయాణం

ప్రముఖ దర్శకుడు భారతీరాజా వద్ద సహాయ దర్శకుడిగా సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన భాగ్యరాజ్… గురువు వద్ద నేర్చుకున్న కథన శైలికి తనదైన ఆలోచనలను జోడించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

భారతీరాజా తెరకెక్కించిన ‘ఎర్రగులాబీలు’ చిత్రానికి కథ అందించి తొలి విజయాన్ని అందుకున్నారు. 1979లో విడుదలైన ‘సువర్ ఇల్లాథ చిత్రంగల్’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఆయన… ఆ తర్వాత వరుస విజయాలతో అగ్ర దర్శకుల సరసన నిలిచారు.

కుటుంబ కథలకు కొత్త నిర్వచనం

భాగ్యరాజ్ సినిమాలంటే ముందుగా గుర్తుకు వచ్చేది మధ్యతరగతి కుటుంబాల జీవితం. కుటుంబ బంధాలు, ప్రేమ, హాస్యం, భావోద్వేగాలను సమపాళ్లలో మేళవిస్తూ ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు.

సహజమైన సంభాషణలు, బలమైన కథ, మహిళా పాత్రలకు ప్రాధాన్యం, వినోదంతో కూడిన సందేశం ఆయన చిత్రాల ప్రత్యేకతగా నిలిచాయి.

‘ముందానై ముడిచ్చు’, ‘అంద ఏడు నాట్కల్’, ‘చిన్న వీడు’, ‘సుందరకాండం’, ‘డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్’, ‘ధావణి కనవుగల్’, ‘రాసుకుట్టి’, ‘ఆరారో ఆరిరారో’ వంటి చిత్రాలు తమిళ చిత్రసీమలో క్లాసిక్‌లుగా నిలిచిపోయాయి.

ఆయన తెరకెక్కించిన అనేక చిత్రాలు తెలుగులో రీమేక్ అయి ఘన విజయాలు సాధించాయి. ‘అంద ఏడు నాట్కల్’ చిత్రం ‘రాధా కళ్యాణం’, ‘ముందానై ముడిచ్చు’ చిత్రం ‘మూడుముళ్లు’, ‘చిన్న వీడు’ కథ ఆధారంగా తరువాత ‘కితకితలు’ తెరకెక్కింది.

తెలుగు చిత్రసీమతో ప్రత్యేక అనుబంధం

భాగ్యరాజ్‌కు తెలుగు చిత్ర పరిశ్రమతోనూ విడదీయరాని అనుబంధం ఉంది. దర్శకుడిగా ‘పెళ్లైంది కానీ’, ‘చిలిపి పెళ్లాం’, ‘మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు.. మా ఇంటికొస్తే ఏం తెస్తారు’ వంటి చిత్రాలను తెరకెక్కించారు.

అలాగే ‘అబ్బాయిగారు’, ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’, ‘ఆఖరి పోరాటం’ వంటి చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే అందించి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు.

ఇటీవలి కాలంలో ’35 చిన్న కథ కాదు’, ‘కుబేర’ వంటి తెలుగు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి మరోసారి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

హిందీలోనూ విజయగాథ

దక్షిణాదికే పరిమితం కాకుండా బాలీవుడ్‌లోనూ తన ప్రతిభను చాటారు. అమితాబ్ బచ్చన్ హీరోగా తెరకెక్కిన ‘ఆఖ్రీ రాస్తా’ చిత్రానికి దర్శకత్వం వహించి జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నారు.

సాహిత్యంపైనా మక్కువ

సినిమాలతో పాటు సాహిత్యంపైనా భాగ్యరాజ్‌కు అమితమైన ఆసక్తి ఉండేది. ‘భాగ్య’ పేరుతో వారపత్రికను నిర్వహించడంతో పాటు అనేక నవలలు, పుస్తకాలు రచించారు. రచయితగా కూడా ప్రత్యేక గుర్తింపు సంపాదించారు.

పూర్ణిమతో ప్రేమ… జీవిత ప్రయాణం

భాగ్యరాజ్ వ్యక్తిగత జీవితమూ ఓ సినిమా కథనే తలపిస్తుంది.

నటి పూర్ణిమ జయరామ్ తొలిసారి సినిమా అవకాశం కోసం ఆయనను కలిసినప్పుడు చోటుచేసుకున్న చిన్న అపార్థం… ఆ తర్వాత స్నేహంగా మారి… చివరకు ప్రేమగా వికసించింది. కుటుంబ సభ్యుల అంగీకారంతో ఇద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.

భాగ్యరాజ్ తొలి భార్య ప్రవీణ మరణం తర్వాత కొంతకాలం ఒంటరిగా గడిపిన ఆయన… అనంతరం పూర్ణిమను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు శంతను భాగ్యరాజ్, శరణ్య భాగ్యరాజ్ సంతానం.

సినీ ప్రముఖుల సంతాపం

భాగ్యరాజ్ మరణవార్త తెలిసిన వెంటనే తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళులర్పిస్తూ… తమిళ చిత్రసీమ ఒక గొప్ప సృజనాత్మక దర్శకుడిని, విలక్షణ కథకుడిని కోల్పోయిందని పేర్కొన్నారు.

శాశ్వతంగా నిలిచిపోయే వారసత్వం

కుటుంబ కథలను కొత్త కోణంలో ఆవిష్కరించిన దర్శకుడిగా… స్క్రీన్‌ప్లేకు కొత్త ఒరవడి తీసుకొచ్చిన రచయితగా… సహజ నటుడిగా… బహుముఖ ప్రజ్ఞాశాలిగా కె. భాగ్యరాజ్ పేరు భారతీయ సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.

ఆయన తెరకెక్కించిన చిత్రాలు… సృష్టించిన పాత్రలు… కథ చెప్పే వినూత్న శైలి… తరతరాల సినీ ప్రేమికులను అలరిస్తూనే ఉంటాయి. ఒక దర్శకుడు మరణించొచ్చు… కానీ ఆయన చెప్పిన కథలు, సృష్టించిన పాత్రలు, ప్రేక్షకుల హృదయాల్లో నాటిన భావోద్వేగాలు మాత్రం ఎన్నటికీ మరణించవు. అందుకే భాగ్యరాజ్ లాంటి సృజనకారులు శరీరంగా దూరమైనా… వారి కళ శాశ్వతంగా వెండితెరపై, ప్రేక్షకుల హృదయాల్లో చిరంజీవిగానే నిలిచి ఉంటుంది. ఆయన మరణం దక్షిణ భారత చిత్ర పరిశ్రమకు తీరని లోటుగా సినీ వర్గాలు అభివర్ణిస్తున్నాయి.

అలా చేయకూడదు ఎప్పుడూ

ఈ మధ్య మా ఇంట్లో పనిచేసే పనిమనిషి ‘ సార్ .. ఊరు వెళ్ళేది ఉంది సెలవు కావాలి ‘ అని అడిగింది. మాటి మాటికి సెలవు కావాలి అని అంటావు , నీవు లేనప్పుడు మాకు చాలా ఇబ్బంది అవుతుంది అని అన్నాను. తప్పని సరిగా వెళ్లాల్సిన పని సార్ , గవర్నమెంట్ వాళ్ళు మాకు ఇల్లు కట్టుకోవడానికి కొంచెం డబ్బులు ఇస్తున్నారు. అందుకే ఊరు వెళ్ళి , ఆ ఆఫీసర్స్ వచ్చినప్పుడు మా వివరాలన్నీ చెప్పాలి .అందుకే తప్పకుండా వెళ్ళాలి సార్ అని బ్రతిమాలింది. ప్రతీసారి ఏదో ఒకటి చెప్పి వెళ్తావు . ఇలా అయితే కష్టం .వేరే పనమ్మాయిని కొన్ని రోజులకు పెట్టి వెళ్ళు అని చెప్పాను. అలాగే సార్ అని చెప్పి మర్నాడు ఒక అమ్మాయిని తీసుకొచ్చి మా ఇల్లు చూపించింది. చేయాల్సిన పని గురించి ఆ అమ్మాయికి చెప్పింది. తర్వాత ఊరు వెళ్ళిపోయింది.


కొత్తగా వచ్చిన ఈ పనమ్మాయి బాగా హుషారు. పనిలో దిగగానే చురుగ్గా చేస్తోంది. బట్టలు అవీ నీట్ గా ఉతకడం , ఇల్లు బాగా ఊడవడం , అంట్లు చక్కగా తోమడం ఇలా అన్ని పనులు బాగా చెయ్యసాగింది.
మా భార్యాభర్తలిద్దరికీ ఈ పనమ్మాయి బాగా నచ్చింది. ఈమెనే కంటిన్యూ చేస్తే బాగుంటుంది కదా అన్న ఆలోచన వచ్చింది. కొన్ని రోజుల తర్వాత మా పాత పని మనిషి ఊరి నుండి రాగానే మా ఇంటికి వచ్చింది. పనిలో దిగింది. కొత్త పనమ్మాయి రావడం మానేసింది. కానీ మాకు ఈ పాత పనిమనిషి పని నచ్చడం లేదు. ఎలా చెప్పాలి అనుకుంటూ ‘ నువ్వు మాటి మాటికి ఊరు వెళ్లాల్సిన పని ఉంటుంది కదా…అందుకే మొన్న తీసుకొచ్చిన పనమ్మాయినే రమ్మని చెప్పు అన్నాము.


‘ ఓరి దేవుడోయ్ ..ఆ గుంట నా బతుక్కే ఎసరు పెట్టింది..అనవసరంగా దాన్ని తీసుకొచ్చాను ‘ అని శోకాలు పెట్టసాగింది.
ఎందుకొచ్చిన గొడవ అని మేము కూడా సరేలే నువ్వే రా అని చెప్పాం.
ఇక్కడ మా పాత పనిమనిషి చేసిన తప్పు ఏమిటి అంటే తనకంటే బాగా పనిచేసే కుర్ర అమ్మాయిని మాకు చూపించడం . మనం కూడా నిత్య జీవితంలో , వృత్తి లో పొరపాటున కూడా మనకంటే బెటర్ పర్సన్ ని మన పై వాళ్ళకి చూపించకూడదు. అంతే కదా..నాతో మీరు ఏకీభవిస్తారు కదా ఫ్రెండ్స్ !!!

పగలు పట్టేయడం!

తల నుండు విషము ఫణికిన్, వెలయంగా తోక నుండు వృశ్చికమునకున్, …ఖలునకు నిలువెల్ల విషము కదరా సుమతీ.

పాము, తేలు కన్నా ప్రమాదం చెడ్డ వాడైన మనిషి, సంస్కార హీనుడైన వ్యక్తి. శరీరం మొత్తం విషం ముట్టుకుంటే మరణం.

సూత్ర దారుడు తన మాటలు చెప్పాడు,
అది శ్మశానం, ఊరుకి తూర్పు వైపున ఉంది, అర్ధరాత్రి దాటింది, కిరణ్, శంకర్ నడుచుకుంటూ ఊరు వైపు వస్తున్నారు. పక్క ఊరిలో ఏదో పనికి వెళ్లారు, ఆలస్యం అయింది. భయం భయంగా నడుచుకుంటూ వస్తున్నారు. శ్మశానం వచ్చింది.

కిరణ్ : ఐష్, మాట్లాడకు, సైలెన్స్.

శంకర్ : ఎందుకు?

కిరణ్ : ఇక్కడ దెయ్యాలు ఉంటాయి. మన మాటలు వినబడితే సమాధుల లోనించి లేచి వచ్చి మన మీద రాత్రి పడతాయి. పీడించి పీడించి సుఖం లేకుండా చేస్తాయి.

శంకర్ : అంటే దెయ్యాలు రాత్రులు పడతాయి.

కిరణ్ : అవును.

శంకర్ : మరి పగలు

కిరణ్ : పట్టవు.

శంకర్ : కానీ ఈ రోజుల్లో పగలు కూడా పడుతున్నాయి. పగ పడుతున్నాయి, పగలు పడుతున్నాయి.

పెద్ద శబ్దం, వారిద్దరు ఆ రాత్రిలో కలిసిపోయారు.

దెయ్యాలు రాత్రులు వచ్చి పట్టొచ్చు. దెయ్యాలు రాత్రి పడతాయి. ఊరి మీద పడతాయి. మనుషులు మీద పడతాయి. ఒక నమ్మకం మన పల్లెల్లో. దెయ్యం ఒక మూఢ నమ్మకం. కొందరు నమ్ముతారు. ఎన్నో మానసిక రోగాలు ఇలా బహిర్గతం అవుతాయి.

దెయ్యం పట్టింది అంటే సుఖం. అసలు సమస్య, రోగానికి వైద్యం వాయిదా పడుతుంది. ఏదో భూత వైద్యం చేస్తారు. ఇక్కడ మళ్ళీ ఈ దేశంలో వ్యాపారం. మూఢనమ్మకాలపై వేల కోట్ల వ్యాపారం. బాబాలు, స్వామీజీలు, మసీదులు, దర్గాలు, చర్చిలు…అన్ని చోట్ల.

ప్రార్థనలు, పూజలు, నమాజులు…కాదేదీ వ్యాపారానికి అనర్హం. దేవుడికి ఒక నమ్మకంతో కృతజ్ఞతలు చెప్పే Ritual process … అది వైయక్తికం. మీ ఇష్టం. లేదా మన ఇష్టం.

కానీ రోగానికి భూత వైద్యం అంటూ మోసం చేయడం మహా పాపం. దానికి దేవుడ్ని అడ్డుగా పెట్టడం, మతం, నమ్మకంతో ఆడుకోవడం ఇది తప్పు కదా. కళ్ళు తెరవాలి.

ఇక పగ పట్టడం, పగలు పట్టడం, పగలు, రాత్రి, Day & Night. లేని దెయ్యాలు ఏం చేయగలవు? సమస్య అల్లా, ఉన్న మనుషులు. పక్కిల్లు, ఆఫీసు లో కొలీగ్, చుట్టాలు, పక్కాలు…, చుట్టూ ఉన్న మనుషులు, తమ్ముడు, చెల్లి, అక్క మొగుడు, అమ్మ, నాన్న, అత్త, బావ, పాలోల్లు, మరదలు…ఏదో ఆశిస్తారు మన నుంచి. లేదా కోపంలో మనం ఏదో అంటాము. ప్రతీసారి తూకం వేసి మాట్లాడలేము కదా!

ఒక మాట అటూ ఇటూ జరుగుతుంది, అందులో బూతు మాట(మన దేశంలో బూతులు మాటాడడం అత్యంత సహజం. చాలా తక్కువ మంది దీనికి అతీతం) దొర్ల వొచ్చు. By mistake.

మన చుట్టూ ఉన్నవాళ్ళు మన నుంచి ఆశించే దానికి, మనం చేయగలిగే స్థాయికి మధ్య ఎప్పుడూ ఆకాశం భూమి అంత వ్యత్యాసం ఉంటుంది.

ఎవరి పరిమితులు వారికి ఉంటాయి. అయినా ఈరోజుల్లో, ఎక్కువ మంది,

మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏం ఇస్తావు? ఈ రకం మనుషులు అన్ని చోట్లా. స్వార్థం, దురహంకారం రాజ్యం చేస్తున్నాయి. ఎదురింటి వాడు సుఖంగా ఉంటే మనం తట్టుకోలేము. చేతబడి చేసి చంపేయాలి అనేంత కసి. అందరూ భారతీయులే. అందరూ ఒక రాష్ట్రం, ఒక ఊరు, ఇంకా చెప్పాలంటే పాలోళ్ళు. అన్నదమ్ముల పిల్లలు.

ఇంత కల్మషం, కుళ్ళు రాజ్యం చేస్తున్నాయి. అంత మాయ, మోసం!

దెయ్యాలు రాత్రి పడతాయి. దెయ్యాలు నమ్మకం, విషం నిండిన మనుషులు పగలే దయ్యాలు, భూతాలు, రాక్షసులు అయ్యి హాని చేస్తున్నారు. వెన్నుపోట్లు, ముందు పోట్లు.

మీ ప్రతిభను తీసి పడేస్తారు. మీరు వెళ్ళాక, మీ గురించి మీ ఆఫీసులో బాసుకి మీ గురించి చెడ్డగా చెబుతారు. మీ క్రెడిట్ వాడు తీసుకుంటాడు. పై వాడికి బానిసలా పడి ఉంటే మీ ఉద్యోగం పదిలం. లేదంటే మీ టాలెంట్ కాదు, కుదరదు, వారు వెనుక తీసిన గోతిలో మిమ్మల్ని పడేస్తారు.

మరణమో వీర స్వర్గమో, కాదు విజయమో వీర స్వర్గమో, ఈ కలియుగంలో నెగ్గాలంటే యుద్ధం చేయాలి. ఎత్తుకు పై ఎత్తులు వేయాలి. ఈ జీవితం వైకుంఠ పాళీ ఆట, తినేసే పాములు ఎక్కువ. మన నిచ్చెన లాగేసుకుని, పక్కవాడు ఎక్కేస్తాడు. నీతులు జాతులు లేని మనుషులు మన చుట్టూ. కలియుగం అంతే. పగలు పట్టేస్తారు. నిజం, ఒక్కోసారి ఇంట్లో మనుషులు కూడా, తల్లి, తండ్రి, తమ్ముడు…, వీళ్ళు కూడా పగలు పట్టేస్తారు. ఈరోజుల్లో ఇంట్లోనూ బయటా కూడా యుద్ధం చేయాలి, గెలవాలంటే! ఎవరు మన మనుషులో అర్థం కాదు.

ఎక్కడో కొందరు పుణ్యపురుషులు ఉన్నారు. చాలా తక్కువ. కానీ ధర్మం, గెలుస్తుంది. శాంతిని స్థాపిస్తుంది.
సత్యమేవ జయతే!

శ్రీవారి సింగార వైభవం పునుగు కాప్పు సేవ

అలంకార ప్రియుడైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి మూలమూర్తికి శుక్రవారాభిషేకం సందర్భంగా చేసే ప్రత్యేక సేవ ను పునుగు కాప్పు సేవ అంటారు. సుగంధ భరితమైన పునుగు తైలాన్ని స్వామి వారి విగ్రహానికి లేపనంగా పూయడమే శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ సేవ విశేషం.
క్రీ శ 1434 నాటి శాసనాధారాల ప్రకారం తిరుక్కలి కన్రిదాసర్ అనే వైష్ణవ నాయకుడు ప్రతి ఏడాది దక్షిణాయనంలో (ఆషాడం నుంచి మార్గశిర మాసం వరకు) స్వామి వారి ముఖానికి అభిషేక సమయంలో పునుగు తైలాన్ని లేపనంగా పూయాలని నిర్దేశించి, అవసరమైన తైల సరఫరాకు ఏర్పాటు చేసారని తెలుస్తోంది. మధ్యలో క్రమం తప్పినా విజయనగర వంశీకుడైన సాళువ నరసింగరాయలు పకడ్బందీ గా చేసిన ఏర్పాట్లతో క్రీ శ 1467 డిసెంబర్ నెల నుంచి ఈ సేవ క్రమపద్ధతిలో కొనసాగినట్టు కూడా శాసనాలు తెలియచేస్తున్నాయి. క్రీ శ 1496 లో కందాడై అప్పా చిన్నయ్యంగార్ అనే వైష్ణవ నాయకుడు ప్రతి నెల రెండవ శుక్రవారం ఈ సేవ ను నిర్వహించే విధంగా నిర్దేశించినట్టు శాసనాధారాలు పేర్కొంటున్నాయి. క్రీ శ 1517 లో పొట్నూరులో విజయ స్తంభాన్ని స్థాపించి తిరిగి వెళ్తూ తిరుమలేశుని దర్శించుకున్న విజయనగర ప్రభువు శ్రీ కృష్ణదేవరాయలు ప్రతి శుక్రవారం అభిషేకం చేసేటప్పుడు స్వామి వారి మూలమూర్తి ముఖానికే కాకుండా విగ్రహానికి పునుగు తైలాన్ని లేపనంగా పూయాలని నిర్ధేశించి , అందుకోసం గొడుగునాడు నుంచి వచ్చే శిస్తు లో వేయి వరహాలు వెచ్చించేలా ఏర్పాట్లు చేసినట్టు శాసనాధారాలు తెలియచేస్తున్నాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతి శుక్రవారం అభిషేక సమయంలో ఊరేగింపుగా సుగంధ ద్రవ్యాలతో పాటు తెచ్చే పునుగు తైలాన్ని అర్చకులు స్వామివారి మూలమూర్తికి లేపనంగా పూసే విధానం కొనసాగుతోంది.


1933 లో తిరుమల తిరుపతి దేవస్థానాల ( టి టి డి) పాలనా వ్యవస్థ ఏర్పాడి నప్పుడు నిర్ధేశిత సేవల దిట్టం జాబితాలో ఈ పునుగు కాప్పు తైల సేవను చేర్చారు. అందుకోసం టి టి డి కి చెందిన గోశాలలో పునుగు పిల్లులను పెంచుతూ అవి విసర్జించే పునుగు తైలాన్ని ఒక పద్దతి ప్రకారం సేకరించే ఏర్పాటు కూడా చేశారు. అయితే 2007 లో ఒకరిద్దరు అటవీ శాఖ అధికారుల అత్యుత్సాహంతో ఏర్పడిన వన్యమృగ సంరక్షణ చట్టాల సమస్య కారణంగా ఆ పిల్లులను తిరుపతిలోని జూ పార్క్ లో అటవీ శాఖ పర్యవేక్షణలో ఉంచి అవి విసర్జించే తైలాన్ని మాత్రం సేకరించి స్వామి అభిషేక సేవకు వినియోగించే విధానం అమలులో వచ్చి కొనసాగుతోంది.

ఓం నమో వేంకటేశాయ