మల్కాపూర్‌లో ఉచిత వైద్య శిబిరం

మల్కాపూర్‌లో ఉచిత వైద్య శిబిరం

​చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపూర్ గ్రామంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం అత్యంత విజయవంతంగా నిర్వహించారు. దివ్యచక్ర చారిటబుల్ ట్రస్ట్, హైదరాబాద్‌ లోని సప్తగిరి హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని ప్రముఖ జ్యోతిష్య దైవజ్ఞులు, రత్న జ్యోతిష్య బ్రహ్మజ్ఞాని గురుమాతాశ్రీ దివ్యశ్రీ రమణ చక్రవర్తులు పర్యవేక్షణలో నిర్వహించిన ఈ శిబిరంలో ప్రముఖ వైద్య నిపుణులు డా. శివ ప్రసాద్ (జనరల్ సర్జన్, ఈ ఎన్ టి), డా. ప్రవీణ్ కుమార్ రెడ్డి (ఆర్థోపెడిక్), డా. రాజ ప్రసాద్ (జనరల్ మెడిసిన్) డా. భాగ్య సింగ్ బృందం రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సాధారణంగా కనిపించే కీళ్ల నొప్పులు, ఈఎన్టీ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.

​ఉచిత సేవలు – భారీ స్పందన
గ్రామ ప్రజలకు సాధారణ వైద్య పరీక్షలతో పాటు, ఈఎన్టీ చెక్-అప్, రక్త పరీక్షలు, షుగర్ పరీక్షలను పూర్తి ఉచితంగా నిర్వహించారు. ఈ శిబిరానికి గ్రామస్తుల నుండి విశేష స్పందన లభించింది. సుమారు వందలాది మంది రోగులు ఈ శిబిరానికి హాజరై వైద్య సేవలను సద్వినియోగం చేసుకున్నారు.

​వైద్య బృందానికి ఘన సన్మానం
వైద్య సేవల అనంతరం గ్రామంలో ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గురుమాతాశ్రీ దివ్యశ్రీరమణ చక్రవర్తుల ను, వైద్య బృందాన్ని గ్రామ సర్పంచ్, జిల్లా సర్పంచ్ ఫోరం జనరల్ సెక్రటరీ గిర్కటి నిరంజన్ గౌడ్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. పేద ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ వహించి ఉచితంగా వైద్యం అందించిన ట్రస్ట్ సభ్యులకు, వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, ట్రస్ట్ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.