వాణిజ్య గ్యాస్ ధర తగ్గించాలి

వాణిజ్య గ్యాస్ ధర తగ్గించాలి
ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై.నరోత్తం
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : కమర్షియల్ గ్యాస్ ధరల పెంపుతో సామాన్య ప్రజలపై తీవ్ర భారం పడిందని, పెంచిన వాణిజ్య గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై.నరోత్తం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను ఒక్కసారిగా సుమారు రూ.1000 వరకు పెంచడం వల్ల హోటళ్లు, చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలు ముగిసిన వెంటనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు. కేవలం రెండు నెలల్లోనే గ్యాస్ సిలిండర్ ధరను సుమారు రూ.1303 వరకు పెంచడం ప్రజల నడ్డి విరిచే చర్యగా అభివర్ణించారు. దేశంలో ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని చెప్పుకుంటూనే, ఇలా భారీగా ధరలు పెంచడం కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని అన్నారు.
ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నదని, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కల్పించాల్సిన కేంద్రం, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల భారం మోపే విధానాన్ని అనుసరించడం ఆందోళనకరమని పేర్కొన్నారు. ఇప్పటికే రైతులు, కార్మికులు, చిన్న వ్యాపారులు, గృహిణులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ పరిస్థితుల్లో వాణిజ్య గ్యాస్ ధరలను వెంటనే తగ్గించి వినియోగదారులను ఆదుకోవాలని వై. నరోత్తం కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
