గురువుకు ‘ఐపీఎస్’ శిష్యుడి గురుదక్షిణ!

  • జడ్పీహెచ్‌ఎస్ చిన్నకొండూరులో ఉపాధ్యాయుడు దోటి రాములు అండాలు ఘన వీడ్కోలు
  • ముఖ్య అతిథిగా హాజరై సత్కరించిన సూర్యాపేట ఎస్పీ కే. నరసింహ

​చౌటుప్పల్, ఆంధ్రప్రభ : తనకు విద్యాబుద్ధులు నేర్పి, ఉన్నత స్థానానికి చేర్చిన గురువు రిటైర్మెంట్ వేడుకకు ఆ శిష్యుడు ‘ఖాకీ’ యూనిఫాంలో వచ్చాడు. ఒక జిల్లాకు ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికీ, గురువు ముందు సామాన్య శిష్యుడిగా నిలబడి వందనం చేశాడు. చౌటుప్పల్ మండలం చిన్నకొండూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో భౌతికశాస్త్ర స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేసి పదవీ విరమణ పొందిన దోటి రాములు – అండాలు ఆత్మీయ వీడ్కోలు సభలో ఈ అపురూప దృశ్యం ఆవిష్కృతమైంది. ఈ కార్యక్రమానికి సూర్యాపేట జిల్లా ఎస్పీ కే. నరసింహ, ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై తన గురువును ఘనంగా సత్కరించారు.

​గురువుల సేవలు చిరస్మరణీయం : ఎస్పీ నరసింహ
​ఈ సందర్భంగా ఎస్పీ కే. నరసింహ మాట్లాడుతూ.. తనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువు ఉద్యోగ విరమణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనడం తన జీవితంలో మర్చిపోలేని అనుభూతిని ఇచ్చిందన్నారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమైందని, విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేసేది వారేనని కొనియాడారు. దోటి రాములు అండాలు తన సుదీర్ఘ సేవా కాలంలో ఎంతోమంది విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చారని, ఆయన సేవలు ఎల్లప్పుడూ చిరస్మరణీయంగా ఉంటాయని ఎస్పీ పేర్కొన్నారు. “ఒక విద్యార్థి ఉన్నత స్థానానికి చేరుకున్నప్పుడు గురువు పొందే ఆనందం అమూల్యమైనది. ఈ రోజు నా గురువు గారిని సత్కరించుకునే భాగ్యం కలగడం నా పూర్వజన్మ సుకృతం.” సూర్యాపేట ఎస్పీ నరసింహ తెలిపారు.

​అందరికీ కృతజ్ఞతలు : రాములు – అండాలు
​సత్కారం గ్రహించిన అనంతరం ఉపాధ్యాయుడు దోటి రాములు – అండాలు మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. తన సుదీర్ఘ ఉపాధ్యాయ ప్రస్థానంలో సహకరించిన విద్యాశాఖ అధికారులు, సహచర ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తాను పాఠాలు చెప్పిన విద్యార్థి ఈ రోజు దేశాన్ని రక్షించే ఐపీఎస్ అధికారిగా వచ్చి తనను సత్కరించడం ఉపాధ్యాయుడిగా తన జీవితాన్ని ధన్యం చేసిందని ఆనందం వ్యక్తం చేశారు.
​ఈ వీడ్కోలు మహోత్సవంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, పూర్వ విద్యార్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని రాములు అండాలు దంపతులను ఘనంగా సన్మానించి, శేష జీవితం ప్రశాంతంగా, ఆరోగ్యంగా సాగాలని ఆకాంక్షించారు.