ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు

-ఇద్దరు గనికార్మికులకు తీవ్ర గాయాలు
-తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం

భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ: జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గనికార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. పరకాల నుంచి భూపాలపల్లికి వస్తున్న కన్నె త్రివేద్, గుంటి సంధ్య రాణి ఏపీ 10 ఏబి 1596 నంబర్ గల వ్యాగన్ఆర్ కారులో ప్రయాణిస్తున్నారు.

ఉదయం సుమారు 3:45 గంటల సమయంలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ సమీపంలో రోడ్డుపై నిలిపి ఉంచిన టీజీ 25 టి 1278 నంబర్ గల లారీని వారి కారు ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.

అప్రమత్తమైన స్థానికులు వెంటనే గాయపడిన వారిని భూపాలపల్లిలోని వంద పడకల ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం సింగరేణి ఆసుపత్రికి రిఫర్ చేయగా, పరిస్థితి విషమంగా ఉండటంతో హన్మకొండలోని మెడికవర్ ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం ఇద్దరికీ వైద్యులు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారు భూపాలపల్లి ఏరియాలోని 5 ఇంక్లైన్ గనిలో జనరల్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్నట్లు తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply