ఎస్‌ఐఆర్‌ హెల్ప్ డెస్క్‌ ప్రారంభం

ఎస్‌ఐఆర్‌ హెల్ప్ డెస్క్‌ ప్రారంభం

ఇంటింటి సర్వేను పరిశీలించిన కలెక్టర్

వరంగల్, ఆంధ్రప్రభ : ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) కార్యక్రమాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు ఓటర్ల సందేహాలను నివృత్తి చేయడానికి వరంగల్ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎస్‌ఐఆర్‌ హెల్ప్ డెస్క్‌ను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా హెల్ప్ డెస్క్‌ పనితీరును పరిశీలించిన కలెక్టర్, ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపులకు సంబంధించిన సేవలను ప్రజలకు వేగవంతంగా, పారదర్శకంగా అందించాలని అధికారులకు సూచించారు. అర్హత కలిగిన ప్రతి పౌరుడు ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేలా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లోకల్ బాడీ గణేష్, వరంగల్ తాసిల్దార్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.