కాంటాలు సరే… ఎగుమతులెప్పుడు..?

కాంటాలు సరే… ఎగుమతులెప్పుడు..?

లారీలు రాక కొనుగోలు కేంద్రాలలో పేరుకుపోయిన మక్కల బస్తాలు..
అకాల వర్షాలొస్తే మరోసారి నష్టపోవాల్సిందేనా..?
మక్క రైతు మనోవేదన..

బోనకల్, ఆంధ్రప్రభ : పంట ఆరంభం నుంచి దిగుబడి పొందే నాటి వరకు అన్నదాతకు అడుగడుగునా కష్టాలే..! అన్ని కష్టనష్టాలకోర్చి పంట దిగుబడులు సాధించినప్పటికీ పంట అమ్ముకోవడంలోనూ తిప్పలు తప్పడం లేదు.. ప్రైవేటు దళారుల దోపిడీ నుంచి రైతును కాపాడడానికి ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్న మార్క్ ఫెడ్ కొనుగోలు కేంద్రాలలో కూడా మాకు అవస్థలు తప్పడం లేదని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఖమ్మం జిల్లా బోనకల్ మండల వ్యాప్తంగా ఆరు సహకార సంఘాల పరిధిలో మక్కల కొనుగోలు నిమిత్తం మార్క్ ఫెడ్ అధికారులు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో అన్నదాతల పోరాటాల ద్వారా వచ్చిన కొనుగోలు కేంద్రాలు కూడా ఉన్నాయి. అయితే ఈ కేంద్రాలలో మక్కల కొనుగోళ్ల దగ్గర నుంచి గన్ని సంచుల సరఫరా, కాంటాలు, అనంతరం మొక్కజొన్న బస్తాలను గోదాము లకు తరలించడంలో తీవ్ర జాప్యం జరుగుతుందని అన్నదాత ఆవేదన చెందుతున్నాడు.

రైతుకు గన్ని సంచులు కూడా సకాలంలో అందకపోవడంతో ఒక్కొక్క బస్తా రూ, 25 తో కొనుగోలు చేస్తున్నామని వాపోయారు. ఎట్టకేలకు మక్కలు కాంటాలు వేసినప్పటికీ వాటి రవాణా విషయంలో చోటు చేసుకుంటున్న ఆలస్యం పట్ల రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాంటాలు వేసి 20 రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు వాటిని లారీలతో గోదాము లకు తరలించలేదని వారు తమ గోడును వెళ్ళ బుచ్చుకుంటున్నారు. ఒకవేళ రవాణా నిమిత్తం లారీలు వచ్చినా ఒక్కొక్క బస్తా రవాణాకు రూ, 25 నుంచి 40 వరకు రైతు వద్ద నుండి లారీ డ్రైవర్లు వసూలు చేస్తున్నారని, గత్యంతరం లేని పరిస్థితులలో తాము కూడా ఇవ్వాల్సి వస్తుందని రైతులు తమ దీనస్థితిని వివరిస్తున్నారు.

మబ్బులు చేస్తూ వాతావరణంలో వస్తున్న మార్పులు తమను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయని, అకాల వర్షం వస్తే మరోసారి నట్టేట మునగాల్సి వస్తుందేమోనని భయాందోళనలకు గురవుతున్నామన్నారు. ఇప్పటికైనా మార్క్ ఫెడ్, జిల్లా ఉన్నతాధికారులు స్పందించి బోనకల్ మండలంలో ఏర్పాటు చేసిన ఆరు సహకార సంఘాల పరిధిలో కొనుగోళ్లను వేగవంతం చేసి, కాంటాలు పూర్తయిన మొక్కజొన్న బస్తాలను సాధ్యమైనంత త్వరగా గోదాము లకు తరలించి తమను ఆదుకోవాలని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a Reply