కనకదుర్గమ్మ భక్తుల భారీ కానుకలు..

కనకదుర్గమ్మ భక్తుల భారీ కానుకలు..

17 రోజుల్లో రూ.2.83 కోట్ల ఆదాయం నమోదు..
329 గ్రాముల బంగారం.. 3.8 కిలోల వెండి సమర్పణ
భారీ ఎత్తున విదేశీ కరెన్సీ విరాళం
రోజుకు సగటున రూ.16.65 లక్షల ఆదాయం

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై ఉన్నశ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో భక్తుల రద్దీతో పాటు హుండీ ఆదాయం కూడా గణనీయంగా నమోదైంది. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న అమ్మవారికి దేశ విదేశాల నుంచి భక్తులు సమర్పించిన కానుకలు మరోసారి భక్తి విశ్వాసాన్ని చాటాయి. ఆలయ మహా మండపం ఆరవ అంతస్తులు గడిచిన 17 రోజుల కు సంబంధించిన దేవస్థానంలోని అన్ని ప్రాంతాలలో ఉన్న హుండీలను శనివారం అధికారులు లెక్కించారు.

గత హుండీ లెక్కింపు ఏప్రిల్ 15న జరగగా, తాజా హుండీ లెక్కింపు శనివారం నిర్వహించారు. మొత్తం 17 రోజుల వ్యవధిలో రూ.2,83,17,242 ఆదాయం సమకూరింది. ఇందులో భారతీయ కరెన్సీ నోట్ల రూపంలో రూ.2,70,22,242, నాణేల రూపంలో రూ.12,95,000 లభించాయి. నగదు ఆదాయంతో పాటు భక్తులు బంగారం, వెండి రూపంలో కూడా కానుకలు సమర్పించారు. హుండీలో 329 గ్రాముల బంగారం, 3 కిలోల 800 గ్రాముల వెండి లభించింది.

ఈ కాలానికి గాను రోజువారీ సగటు హుండీ ఆదాయం రూ.16,65,720గా నమోదైంది. అంతేకాకుండా అమెరికా డాలర్లు, యూఏఈ దిర్హమ్స్, జపాన్ యెన్, ఇంగ్లాండ్ పౌండ్స్, కెనడా డాలర్లు, సౌదీ రియాల్స్ తదితర విదేశీ కరెన్సీ కూడా హుండీలో లభించడం విశేషం. వేసవి సెలవులు, వరుస సెలవుదినాలు, వివాహాల సీజన్ నేపథ్యంలో విజయవాడకు భక్తుల రాక మరింత పెరిగిందని, రాబోయే రోజుల్లో ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని దేవస్థానం వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ హుండీ లెక్కింపును దుర్గ గుడి చైర్మన్ బుర్ర గాంధీ ఈవో సేన నాయక్ ఏసి రంగారావులు పర్యవేక్షించారు.

Leave a Reply