మొక్కజొన్న రైతుల ఆవేదన…
మొక్కజొన్న రైతుల ఆవేదన…
- కొనుగోలు కేంద్రాల్లో అవ్యవస్థలు బహిర్గతం
- సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందికొండ గీత
నాగర్‌కర్నూల్, ఆంధ్రప్రభ : నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో మొక్కజొన్న పండించిన రైతుల సమస్యలు పరిష్కారం కాకపోవడంపై సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు కందికొండ గీత ఆందోళన వ్యక్తం చేశారు. మార్కెట్లో నిల్వ ఉన్న ధాన్యంతో రైతులు పడుతున్న ఇబ్బందులు పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదని ఆమె విమర్శించారు.
శనివారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మార్కెట్‌ను సందర్శించిన నాయకులు రైతుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గీత మాట్లాడుతూ, ఆరుగాలం శ్రమించి పండించిన మొక్కజొన్నను మద్దతు ధరకు అమ్మేందుకు కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే రోజులు తరబడి నిరీక్షణ తప్పడం లేదన్నారు. గన్ని బ్యాగులు, హమాలీలు, రవాణా వాహనాల ఏర్పాటులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆమె విమర్శించారు.
జిల్లాలో మొక్కజొన్న దిగుబడిపై మూడు నెలల ముందే అధికారులు నివేదికలు అందుకున్నప్పటికీ ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. దాదాపు 25 రోజుల క్రితం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనప్పటికీ ఇప్పటికీ ధాన్యం కొనుగోలు పూర్తికాకపోవడంతో రైతులు రాత్రింబవళ్లు కాపలా కాస్తూ ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
జిల్లా వ్యాప్తంగా 2.05 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు జరిగినప్పటికీ కేవలం 15 కొనుగోలు కేంద్రాలు మాత్రమే ఏర్పాటు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. సుమారు 35 లక్షల గన్ని బ్యాగులు అవసరముండగా కేవలం 20 లక్షలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, అందులోనూ కొంతమందికి మాత్రమే అందడంతో సాధారణ రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
ప్రభుత్వం నిర్ణయించిన క్వింటాల్‌కు రూ.2400 ధరకు కొనుగోలు చేయాల్సి ఉన్నప్పటికీ సౌకర్యాల లేమి కారణంగా రైతులు మధ్య దళారులకు రూ.1600కే అమ్ముకోవాల్సి వస్తోందని అన్నారు. ఈ పరిస్థితిని దళారులు లాభంగా మార్చుకుని రైతులను నష్టపరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
హమాలీల కొరత కూడా తీవ్రంగా ఉందని, మార్కెట్ యార్డుల్లో ఉన్న కార్మికులు దళారుల ఆధీనంలో ఉండడం వల్ల రైతులకు ఇబ్బందులు పెరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే గన్ని బ్యాగులు, హమాలీలు, రవాణా వాహనాలు అందుబాటులో ఉంచితే సమస్య పరిష్కారం అవుతుందని సూచించారు.
రైతు ప్రభుత్వం అని చెప్పుకునే తెలంగాణ ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని విమర్శిస్తూ, కొనుగోలు కేంద్రాలను పెంచి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం. శ్రీనివాసులు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పొదిల రామయ్య, నాయకులు మధు, సత్యనారాయణ, వెంకటేష్, బాలరాజు, శివ, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
