ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ లో ఆక్రమణలపై కొరడా..

ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ లో ఆక్రమణలపై కొరడా..

ఫుట్ పాత్ పై చిరు వ్యాపారాల తొలగింపునకు మున్సిపల్ సిబ్బంది శ్రీకారం
భారీగా మోహరించిన పోలీసులు
ఆక్రమణల తొలగింపును వ్యతిరేకించిన చిరు వ్యాపారులు, సీఐటీయూ నాయకులు
రింగ్ సెంటర్ లో ఉద్రిక్త వాతావరణం

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ: ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ లో ఫుట్ పాత్ ఆక్రమణల తొలగింపునకు పోలీసులు, మున్సిపల్ అధికారులు శనివారం ఉదయం శ్రీకారం చుట్టారు. ఇటీవల రింగ్ సెంటర్ మొత్తం ఆక్రమణలతో నిండిపోవడంతో విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారి కుచించుకుపోయింది. అంతేకాకుండా రింగ్ విస్తీర్ణం ఎక్కువగా ఉండటంతో వాహనాలు రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. దీంతో తరచూ ట్రాఫిక్ స్తంభించడమే కాకుండా రోడ్డు ప్రమాదాలూ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర్ బాబు ఇటీవల జాతీయ రహదారిపై బ్లాక్ స్పాట్ లను పరిశీలించారు.

ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ లో ఫుట్ పాత్ పై చిరు వ్యాపారులు, హాకర్ల ఆక్రమణలను, ట్రాఫిక్ స్తంభించడానికి, ప్రమాదాలు జరగడానికి గల కారణాలను గుర్తించారు. ఫుట్ పాత్ ఆక్రమణలు తొలగించాలని, రింగ్ నిడివి తగ్గించి ఫుట్ పాత్ తొలగించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే నాలుగు రోజుల క్రితం మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు, మున్సిపల్ కమిషనర్ బి.శ్రీనివాసులు, ఇబ్రహీంపట్నం సీఐ ఎ.సుబ్రహ్మణ్యం రింగ్ సెంటర్ లో ఆక్రమణల తొలగింపునకు పరిశీలించి ఆక్రమణదారులను హెచ్చరించారు. శనివారం ఉదయం ఆక్రమణల తొలగింపునకు రంగం సిద్ధం చేశారు. పోలీసులు భారీగా రింగ్ సెంటర్ కు చేరుకుని మోహరించగా మున్సిపల్ సిబ్బంది ఫుట్ పాత్ ఆక్రమణల తొలగింపును ప్రారంభించారు. మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఫుట్ పాత్ ను పొక్లెయిన్ తో తొలగించారు.

హైదరాబాద్ బస్టాప్ వైపు ఫుట్ పాత్ ను ఆక్రమించిన హాకర్లు, చిరు వ్యాపారాలను తొలగిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న సీఐటీయూ నాయకులు చిరు వ్యాపారులకు అండగా నిలిచారు. చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపకుండా తొలగించడం సరికాదన్నారు. మున్సిపల్, పోలీసు అధికారుల తీరును వ్యతిరేకించారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఆక్రమణలు తొలగించడం, చిరు వ్యాపారులు, సీఐటీయూ నాయకులు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.