కడెం ప్రాజెక్టును సందర్శించిన కలెక్టర్ భవేష్ మిశ్రా

కడెం ప్రాజెక్టును సందర్శించిన కలెక్టర్ భవేష్ మిశ్రా
- వర్షాకాలం లోపు వరద గేట్ల సమస్యలను పరిష్కరించాలని ఆదేశం
కడెం, ఆంధ్రప్రభ: నిర్మల్ జిల్లాలోని చారిత్రాత్మక కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా బుధవారం సాయంత్రం అధికారులతో కలిసి సందర్శించారు. రానున్న వర్షాకాలం దృష్ట్యా ప్రాజెక్టు భద్రత, వరద నిర్వహణపై అధికారులతో క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించారు.
ప్రాజెక్టులో పేరుకుపోయిన పూడికతీత పనులు, వరద గేట్ల పనితీరుపై కలెక్టర్ సుదీర్ఘంగా చర్చించారు. ప్రాజెక్టు ప్రస్తుత స్థితిగతుల గురించి నీటిపారుదల శాఖ ఎస్.ఈ (SE) వెంకట రాజేంద్రప్రసాద్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలో భారీగా వరద వచ్చే అవకాశం ఉన్నందున, గేట్ల వద్ద ఎటువంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను అప్రమత్తం చేశారు.
ప్రాజెక్టు గేట్ల నిర్వహణలో ఏమరపాటు వహించకూడదని, అవసరమైన మరమ్మతు పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి తగు సూచనలు చేశారు. ఈ పర్యటనలో స్థానిక పెద్దూర్ కడం గ్రామ సర్పంచ్ దీకొండ విజయ్, కడెం ప్రాజెక్ట్ ఈ.ఈ (EE) ప్రవీణ్ కుమార్, డి.ఈ (DE) వీరన్న, కడెం తహసిల్దార్ ఖాజా మొయినుద్దీన్, ఎంపీడీవో సునీత, ఏఈఈలు నితిన్ కుమార్, మురళీకృష్ణ, చైతన్య మరియు ఇరిగేషన్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
