రీ సర్వే పనులకు వేగం…

రీ సర్వే పనులకు వేగం…

లక్ష్య సాధనపై జేసీ దృష్టి.

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : రీ సర్వే ప్రక్రియను రైతుల భాగస్వామ్యంతో వేగవంతంగా పూర్తి చేసి, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను ఖచ్చితంగా సాధించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ అధికారులను ఆదేశించారు. ప్రజల్లో సానుకూల అభిప్రాయం (పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్) ఏర్పడేలా పనులను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. బుధవారం ఆదోని సబ్‌కలెక్టర్ కార్యాలయంలో ఆదోని డివిజన్‌కు చెందిన మండలాల్లో జరుగుతున్న రీ సర్వే, పీజీఆర్ఎస్, రెవెన్యూ అంశాలపై జేసీ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా రీ సర్వే పనుల పురోగతిని సమీక్షించి, ప్రతి దశలో ఉన్న పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. మొదటి దశలో 9 మండలాల్లో 9 గ్రామాల్లో రీ సర్వే చేపట్టి 13 నోటిఫికేషన్ స్థాయిని విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. రెండో దశలో చేపట్టిన మరో 9 గ్రామాల్లో కూడా అదే స్థాయిని పూర్తి చేసి తుది దశలో ఉన్నాయని పేర్కొన్నారు.

ఈ రెండు దశలకు సంబంధించిన మిగిలిన పనులను తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు. మూడో దశలో 16 గ్రామాల్లో రీ సర్వే పనులు ప్రస్తుతం వీఆర్వో, విలేజ్ సర్వేయర్ స్థాయిలో డ్రాఫ్ట్ ల్యాండ్ రిజిస్టర్ దశలో ఉన్నాయని, ఈ పనులను మే 3వ తేదీలోగా పూర్తి చేయాలని గడువు విధించారు. నాలుగో దశలో 17 గ్రామాల్లో రీ సర్వే పూర్తై వీఆర్వో, సర్వేయర్ లాగిన్ దశలో ఉన్నట్లు తెలిపారు. ఐదో దశలో 15 గ్రామాల్లో రీ సర్వే పూర్తై గ్రౌండ్ ట్రూతింగ్ దశలో కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.

ఈ దశలో రైతుల భాగస్వామ్యాన్ని పెంచి పారదర్శకంగా ప్రక్రియను పూర్తి చేయాలని, డ్రాఫ్ట్ పట్టాదారు పాసుపుస్తకాలను 100 శాతం పూర్తి చేయాలని స్పష్టం చేశారు. మే, జూన్ నెలల నాటికి అర్హ రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు అందేలా సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మార్చి 2027 నాటికి రీ సర్వే పూర్తి చేసి ప్రతి అర్హ రైతుకు పాసుపుస్తకాలు అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. అదేవిధంగా ఎఫ్-లైన్, మ్యుటేషన్, ఆర్‌ఓఆర్ సంబంధిత అంశాల్లో ప్రజలకు సంతృప్తికర సేవలు అందించాలని సూచించారు.

పీజీఆర్ఎస్‌లో నమోదయ్యే ఫిర్యాదులను సమగ్రంగా పరిశీలించి సంతృప్తికరంగా పరిష్కరించాలన్నారు. పరిష్కారం సాధ్యం కాని సందర్భాల్లో స్పష్టమైన ఎండార్స్మెంట్ ఇవ్వాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రీ సర్వే ప్రక్రియలో వేగం, ఖచ్చితత్వం, పారదర్శకతను సమన్వయం చేస్తూ రైతులకు న్యాయం జరిగేలా ప్రతి అధికారి బాధ్యతగా వ్యవహరించాలని జేసీ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో తహసీల్దార్ శేషఫణి, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే శ్రీనివాసరాజు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply