గుండెపోటుతో కార్మిక నాయకుడు కన్నుమూత..

గుండెపోటుతో కార్మిక నాయకుడు కన్నుమూత..

  • కార్మిక లోకాన్ని కుదిపేసిన రాజయ్య మృతి
  • రాజయ్య మరణంతో విషాదంలో కార్మికులు

భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రముఖ కార్మిక నాయకుడు, సీపీఎం కార్యవర్గ సభ్యుడు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కంపేటి రాజయ్య గుండెపోటుతో మృతిచెందడం కార్మిక లోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన ఆకస్మిక మరణం పట్ల కార్మికులు, సహచర నాయకులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. దీర్ఘకాలంగా కార్మికుల హక్కుల కోసం నిస్వార్ధంగా పోరాడిన రాజయ్య, ముఖ్యంగా కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషించారు.

కార్మికుల సమస్యలను యాజమాన్యాల ముందు ధైర్యంగా ఉంచి, పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేసిన నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అవసరమైనప్పుడు కార్మికులకు అండగా నిలబడి, వారి న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ముందుండేవారు. ఇలాంటి నాయకుడి ఆకస్మిక మరణం కార్మిక లోకానికి తీరని లోటుగా భావిస్తున్నారు.

రాజయ్య మృతి వార్త తెలిసిన వెంటనే అనేక ప్రాంతాల నుంచి కార్మికులు, నాయకులు సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన సేవలను స్మరించుకున్నారు. కార్మిక హక్కుల కోసం అహర్నిశలు కృషి చేసిన నాయకుడిని కోల్పోవడం బాధాకరమని పలువురు పేర్కొన్నారు. రాజయ్య లేకపోవడం కార్మిక ఉద్యమానికి పెద్ద దెబ్బగా మారిందని, ఆయన చూపిన మార్గంలోనే పోరాటాలను కొనసాగిస్తామని కార్మిక సంఘాల నాయకులు తెలిపారు.

Leave a Reply