CM Revanth | బీఆర్ఎస్ నేతలపై నిఘా ఎందుకు….

CM Revanth | బీఆర్ఎస్ నేతలపై నిఘా ఎందుకు….

CM Revanth | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. కొంతమంది ఐపీఎస్ అధికారులు తమ ఫోన్లు, ఇళ్ల ముందు ఉన్న సీసీ కెమెరాలను హ్యాక్ చేస్తున్నారని ఆరోపించారు. బెంగళూరు నుంచి ప్రైవేట్ హ్యాకర్లను తీసుకువచ్చి హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో ఉంచి బీఆర్ఎస్ నాయకులపై నిఘా పెడుతున్నారన్నారు.

ఈ వ్యవహారంపై తమ దగ్గర అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయని, సమయం వచ్చినప్పుడు అన్నీ బయటపెడతామని హరీష్ రావు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత, రిటైర్ అయినా సంబంధిత అధికారులను వదిలిపెట్టమని హెచ్చరించారు.

మా పార్టీ నాయకులపై ఫేక్ పోస్టులు పెడుతున్నారని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా, అసలు నిందితులపై కేసు పెట్టకుండా క్రిశాంక్‌పై కేసు పెట్టారని మండిపడ్డారు. ఇది దొంగతనం చేసిన వ్యక్తిని వదిలేసి, ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వాడినే లోపల పెట్టినట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. క్రిశాంక్‌పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారని, ఫోన్ తీసుకుపోయి పోలీసులకు ఇస్తే కూడా అలాంటి కేసు పెడతారా అని కోర్టు ప్రశ్నించి, ఆ కేసును కొట్టివేసిందని హరీష్ రావు తెలిపారు. ఈ ఘటన ప్రభుత్వ తీరును బయటపెడుతోందని విమర్శించారు.

Leave a Reply