జనగణన అవగాహనకు 5కె రన్…

జనగణన అవగాహనకు 5కె రన్…

  • ప్రజల భాగస్వామ్యంపై అధికారుల పిలుపు

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : దేశ అభివృద్ధికి ఖచ్చితమైన జనాభా లెక్కలు ఎంతో అవసరమని జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ పేర్కొన్నారు. జనగణనపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన 5కె రన్ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. నగరంలోని కొండారెడ్డి బురుజు వద్ద ప్రారంభమైన ఈ రన్‌ను జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్, నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు జెండా ఊపి ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో యువత, విద్యార్థులు, ఉద్యోగులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

రన్ అనంతరం కలెక్టరేట్ వద్ద విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. పురుషుల విభాగంలో మనీష్ తొలి బహుమతి సాధించగా, గోవింద్ ద్వితీయ, వెంకట్ భరత్ తృతీయ స్థానాల్లో నిలిచారు. మహిళల విభాగంలో రేణుక మొదటి, సోనాక్షి రెండో, రామలక్షి మూడో స్థానాలు దక్కించుకున్నారు. విజేతలకు వరుసగా రూ.5,000, రూ.3,000, రూ.2,000 నగదు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజలు స్వచ్చందంగా ముందుకు వచ్చి స్వీయ జనగణనలో పాల్గొని తమ వివరాలను ఆన్లైన్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని కోరారు. అందరూ పాల్గొంటే ఖచ్చితమైన, దోషరహిత సమాచారం లభిస్తుందని తెలిపారు.

జనగణన సిబ్బంది చరవాణి నంబర్ తప్ప ఇతర వ్యక్తిగత వివరాలు, ఓటీపీలు అడగరని, వేలిముద్రలు లేదా ఐరిస్ సేకరించరని స్పష్టం చేశారు. ఏవైనా సందేహాల కోసం 1855 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించవచ్చని సూచించారు. ఈ నెల 30వ తేదీ వరకు స్వీయ జనగణనకు అవకాశం ఉందని, నమోదు అనంతరం 11 అంకెల ప్రత్యేక సంఖ్య (SEID) జెనరేట్ అవుతుందని వివరించారు. నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు మాట్లాడుతూ, మే 1 నుంచి ఇంటింటా జనగణన సర్వే ప్రారంభమవుతుందని తెలిపారు. ఎన్యుమరేటర్లు వచ్చినప్పుడు ప్రజలు పూర్తి సహకారం అందించాలని కోరారు.

ఇప్పటికే సిబ్బందికి రెండు విడతల్లో శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఖచ్చితమైన జనాభా లెక్కలు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు కీలకమని పేర్కొన్నారు. ప్రజలు స్వయంగా వివరాలు నమోదు చేస్తే సమయం ఆదా అవుతుందని, సమాచారం నాణ్యత మెరుగవుతుందని చెప్పారు. ఎన్యుమరేటర్లు ఇంటికి వచ్చినప్పుడు ఎస్ఈఐడి నంబర్ చూపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డి.ఆర్.ఓ చిరంజీవి, డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, సెన్సస్ ఇన్‌చార్జి అధికారి ఎస్. ఇశ్రాయోలు, ఎస్.ఈ రమణమూర్తి, ప్రజారోగ్య అధికారి డా. ఎం. రఘు, డీఎన్డీఓ భూపతి తదితరులు పాల్గొన్నారు.