సీఎం పర్యటనకు సర్వం సిద్ధం..
మాధవరంలో ముమ్మర ఏర్పాట్లు
సభా ప్రాంగణాన్ని పరిశీలించిన ఎస్పీ విక్రాంత్ పాటిల్.. అధికారులకు కీలక ఆదేశాలు
మంత్రాలయం, ఆంధ్రప్రభ: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 25న మంత్రాలయం మండలం మాధవరం గ్రామంలో పర్యటించనున్న నేపథ్యంలో సభా ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. పర్యటన విజయవంతం చేసేందుకు చేపట్టిన ఏర్పాట్లను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఎస్పీతో పాటు టీడీపీ జోనల్ ఇన్‌చార్జి శ్రీనివాస రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి సభా ప్రాంగణం, హెలిప్యాడ్, వాహనాల పార్కింగ్ ప్రాంతాలు, భోజన ఏర్పాట్లు, బారికేడింగ్, తాగునీటి సదుపాయాలు, ప్రజలకు కల్పిస్తున్న వసతులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి చేపట్టిన ఏర్పాట్లను సమీక్షించిన వారు, ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని పనులను గడువులోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సభకు భారీ సంఖ్యలో రైతులు, మహిళలు, యువతతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యే అవకాశం ఉన్నందున భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయాలని సూచించారు.
ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ నిర్వహణ, ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. సభా ప్రాంగణంలో తాగునీరు, వైద్య సదుపాయాలు, పారిశుధ్య ఏర్పాట్లు సమృద్ధిగా కల్పించాలని ఆదేశించారు.
ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నాయకులు కోరారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో జిల్లా, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
