వ్యవసాయంలో విప్లవం..

వ్యవసాయంలో విప్లవం..
అమరావతి, ఆంధ్రప్రభ: వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి. పంటల సాగులో కూలీల ఖర్చులు తగ్గించి రైతుకు అదనపు ఆదాయం దక్కేలా శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. అందులో భాగంగా సస్యరక్షణలో డ్రోన్ల వినియోగం ప్రారంభించనున్నారు. మరో రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా పంట పొలాల్లో మందుల పిచికారిలో డ్రోన్లు భాగస్వామ్యం కానున్నాయి. కేవలం 6 గంటల్లో 30 ఎకరాల పంటపై సస్యరక్షణ మందులను పిచికారి చేయవచ్చు. సస్యరక్షణకు భారీగా ఖర్చులు చేసి పెట్టుబడుల భారంతో నలిగిపోతున్న రైతాంగానికి భవిష్యత్తులో డ్రోన్ పిచికారి ఎంతో మేలు చేయనుంది. కీటక శాస్త్ర విభాగానికి చెందిన శాస్త్రవేత్తలు డ్రోన్ పరికరాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఒక కూలీకి రోజుకు రూ.400 ఖర్చు అవుతుండగా, ఒక కూలీ చేసే పనిని డ్రోన్ కేవలం పది నిమిషాల్లో పూర్తి చేయగలదు. ప్రస్తుతం సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని బయటపడేయాలంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరం. రైతులు సేద్యం చేసి నష్టపోయే పరిస్థితి మారాలి. ఈ దిశగా శాస్త్రవేత్తలు విస్తృతంగా ప్రయోగాలు చేస్తున్నారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రాల్లో (ఆర్ఆర్ఎస్) ఈ రంగంలో గణనీయమైన పురోగతి సాధించారు. ముఖ్యంగా డ్రోన్లతో సస్యరక్షణ ఒక ముఖ్యమైన అభివృద్ధిగా నిలుస్తోంది. దీని వల్ల భవిష్యత్తులో ఉమ్మడి గుంటూరు జిల్లా రైతులకు మంచి ప్రయోజనం కలుగుతుందని వ్యవసాయశాఖ అధికారులు భావిస్తున్నారు.
వ్యవసాయంలో పాత పద్ధతులు మారాల్సిన అవసరం ఉంది. అప్పుడే రైతులు కొత్త సవాళ్లను ఎదుర్కొనగలరు. ఈ దిశగా వ్యవసాయ శాస్త్రవేత్తలు విస్తృత పరిశోధనలు చేస్తున్నారు. సస్యరక్షణలో కూలీల ఖర్చు ఎక్కువగా ఉండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి పరిష్కారంగా డ్రోన్ల వినియోగంపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. కొత్త వంగడాల అభివృద్ధి, ఆధునిక వ్యవసాయ పరికరాల తయారీలో రాష్ట్రంలోని కొన్ని పరిశోధన కేంద్రాలకు జాతీయ స్థాయి గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రాష్ట్రీయ కృషి విజ్ఞాన యోజన పథకం కింద తక్కువ ఖర్చుతో డ్రోన్లను ఉపయోగించి తక్కువ సమయంలోనే విస్తీర్ణమైన పంటలకు క్రిమిసంహారక మందులు పిచికారి చేసే విధానంపై ప్రయోగాలు జరుగుతున్నాయి. ఆర్ఆర్ఎస్ అధికారుల నేతృత్వంలో కీటక విభాగానికి చెందిన సీనియర్ శాస్త్రవేత్తలు డ్రోన్ వినియోగంపై పరిశోధనలు కొనసాగిస్తున్నారు.
6 గంటల్లో 30 ఎకరాలకు పిచికారి
డ్రోన్ ద్వారా ఏ పంటకైనా, ఏ సమయంలోనైనా సులభంగా పిచికారి చేయవచ్చు. ఒక ఎకరానికి కేవలం 10 నిమిషాల్లో స్ప్రే పూర్తి చేయవచ్చు. డ్రోన్లతో అన్ని రకాల పురుగు మందులు, కలుపు నివారణ ద్రావకాలు, ఆర్గానిక్ ద్రావణాలు, నీటిలో కరిగే ఎరువులు కూడా పిచికారి చేయవచ్చు. సాధారణంగా ఒక ఎకరానికి పిచికారి చేయాలంటే 200 లీటర్ల నీరు అవసరం కాగా, డ్రోన్ ద్వారా కేవలం 10 నుంచి 14 లీటర్ల నీటితో సరిపోతుంది. 2-3 అడుగుల ఎత్తులో సమానంగా పిచికారి చేయడం డ్రోన్ ద్వారా సాధ్యమవుతుంది. డ్రోన్ పిచికారితో 95% నీరు, 95% సమయం, 25-40% మందు వినియోగం ఆదా అవుతుంది. పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది. మందుల మోతాదు తగ్గడం వల్ల పర్యావరణ కాలుష్యం కూడా తగ్గుతుంది.
ఖరీఫ్ నుంచి పూర్తి స్థాయి వినియోగం
రాబోయే ఖరీఫ్ సీజన్ నుంచి అన్ని పంటలపై డ్రోన్ ద్వారా పిచికారి చేయాలని నిర్ణయించారు. తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో, తక్కువ నీటితో పిచికారి చేసే విధానం రైతులకు అవగాహన కల్పించనున్నారు. డ్రోన్ జీపీఎస్, ఆటోపైలట్ సాంకేతికతతో పనిచేస్తుంది. మొబైల్ యాప్ ద్వారా పిచికారి నియంత్రణ సాధ్యమవుతుంది. ఒక డ్రోన్ ధర రూ.3 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఉంటుంది. ఒక్కసారి బ్యాటరీతో ఒక ఎకరానికి 10 నిమిషాల్లో పిచికారి పూర్తి చేయవచ్చు. సిగ్నల్ కోల్పోయినా, బ్యాటరీ తగ్గినా, పని పూర్తయినా డ్రోన్ తిరిగి ప్రారంభ స్థానానికి చేరుతుంది. మొబైల్ యాప్‌లో పిచికారి చేసిన ప్రాంతాన్ని రంగుల ద్వారా గుర్తించవచ్చు. డ్రోన్ నిర్వహణకు శిక్షణ పొందిన పైలట్, బ్యాటరీ నిర్వహణకు వ్యక్తి, మ్యాపింగ్‌కు మరో వ్యక్తి అవసరం. వినియోగానికి ప్రభుత్వ అనుమతి, డీజీసీఏ అనుమతి తప్పనిసరి.
రైతులకు ఎంతో ఉపయోగకరం
డ్రోన్ స్ప్రే రైతులకు ఎంతో ప్రయోజనకరం. పురుగు, తెగుళ్లు కనిపించిన వెంటనే పిచికారి చేసి వ్యాప్తిని నియంత్రించవచ్చు. పొలంలోకి వెళ్లకుండా సురక్షితంగా పిచికారి చేయవచ్చు. డ్రోన్ వినియోగం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. పరిశోధనల ఫలితాల ఆధారంగా రైతులకు డ్రోన్ సేవలను అద్దెకు అందించే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు.
