1.89 lakh crores | తెలంగాణలో కొత్త విప్లవం మొదలైంది
1.89 lakh crores | తెలంగాణలో కొత్త విప్లవం మొదలైంది
1.89 lakh crores | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తాను కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతానని కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణలో కొత్త విప్లవం మొదలైందని, ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఇవాళ పార్టీ ఆవిర్భావం సందర్భంగా.. మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లో భారీ సభ ఏర్పాటు చేశారు. ఆవిర్భావ సభకు ర్యాలీగా వెళ్తున్న కవితను మీడియా ప్రశ్నించగా.. ఈ మేరకు సమాధానమిచ్చారు.
సభలో ఆమె మాట్లాడుతూ…. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ సాధించాం కానీ నీళ్ల కోసం పదేళ్లలో బీఆర్ఎస్ రూ.1.89 లక్షల కోట్లు ఖర్చు చేసింది. పదేళ్లలో 14 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చారు. రూ.1.21 లక్షల కోట్లు ఖర్చు చేసి లక్ష ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చారని మాట్లాడారు. నాటి టీఆర్ఎస్ కోసం నా రక్తం, చెమట, సమయం ధారపోశానని కవిత తెలిపారు.
నాటి టీఆర్ఎస్ బలోపేతం కోసం పనిచేశాను. ఆనాటి కేసీఆర్ వేరు ఇప్పటి కేసీఆర్ వేరు. చేనేత కార్మికులు చనిపోతుంటే ఆనాటి కేసీఆర్ భిక్షాటన చేశారు. ఇవాళ్టి కేసీఆర్ మారిన మనిషి, మర మనిషి, మన మనిషి కాదు. ఎక్కడ చిన్న కష్టం వచ్చినా ఆ సార్ రారు. ఎందుకంటే ఆయన మారిన మనిషి. గుంటనక్కలు, తోడేళ్ల చేతిలో కేసీఆర్ ఖైదీ అయ్యారు. అయన మన మనిషి కాదు. మన కేసీఆర్ అయితే పాలమూరు-రంగారెడ్డి వద్ద కుర్చీ వేసుకుని కూర్చుని కట్టించేవారన్నారు.
కానీ అయన మారిన కేసీఆర్ పంజాబ్, గుజరాత్, బిహార్ వెళ్లి జాతీయ పార్టీ పెట్టాలని చూశారు. ఆ నేపథ్యంలో కేసీఆర్ తెలంగాణ ప్రజలను పట్టించుకోలేదు. ఆయన కేంద్రంతో గొడవ పెట్టుకోకుండా ఉండి ఉంటే ఇప్పటి పాలమూరు పూర్తయ్యేదని పార్టీ సభలో కల్వకుంట్ల కవిత మాట్లాడారు. కాళరాత్రిలో కాగడా వలే తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ జాగృతి ఉద్యమకారులకు వెలుగునిచ్చింది. తెలంగాణ సమాజానికి కాంతిరేఖగా మారింది. మరోసారి బతుకమ్మను ప్రపంచానికి పరిచయం చేసుకున్నాం. ఏ కలలతో తెలంగాణ తెచ్చుకున్నామో అవి నిజం కాలేదు.
ఇవాళ నా జీవితంలో మరిచిపోలేని రోజు అవుతుందన్నారు. తెలంగాణ భవిష్యత్ రాసుకోవడానికి మనందరి భాగస్వామ్యం కావాలి. కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ఉద్యమ రథం దారి తప్పింది. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రజల ఆర్తిని అర్థం చేసుకోలేకపోయింది. సామాజిక తెలంగాణ రథ చక్రం విరిగి ముక్కలైంది. కొత్త రాష్ట్రంలో జరగాల్సిన పనులు సరిగా జరగలేదు. తెలంగాణ వస్తే బానిస సంకెళ్లు పోతాయని భావించాం. కానీ, రైతులకు బేడీలు పడ్డాయి. ఇసుక దందా వల్ల దళితులు దెబ్బలు తిన్నారని కవిత మాట్లాడారు.
