ఉయ్యాలవాడలో యువకుడి మృతి

ఉయ్యాలవాడలో యువకుడి మృతి

  • స్నేహం శత్రుత్వంగా మారి రక్తపాతం

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ ; కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడ గ్రామంలో స్నేహితుల మధ్య నెలకొన్న వివాదం ప్రాణాంతకంగా మారి విషాదాన్ని మిగిల్చింది. చిన్న గొడవ పెద్ద ఘర్షణగా మారి ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. స్థానికుల వివరాల ప్రకారం వంశీ, మనోజ్ అనే ఇద్దరు స్నేహితుల మధ్య కొంతకాలంగా వ్యక్తిగత కారణాలతో విభేదాలు నెలకొన్నాయి.

ఈ నేపథ్యంలో గురువారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వంశీ కుటుంబ సభ్యులు మనోజ్ ఇంటి వద్దకు వెళ్లి వివాదానికి దిగడంతో మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైన వంశీ, మనోజ్‌పై కత్తితో దాడి చేసినట్లు సమాచారం. మెడ భాగంలో తీవ్ర గాయాలు కావడంతో మనోజ్‌ను అత్యవసరంగా ఆసుపత్రికి తరలించినప్పటికీ… చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు.

ఈ సంఘటనతో గ్రామంలో ఒక్కసారిగా విషాద వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. గ్రామంలో ఉద్రిక్తత నెలకొనడంతో అదనపు బలగాలను మోహరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

Leave a Reply