today ipl match | ఇవాళ గుజరాత్, బెంగళూర్ ఢీ

today ipl match | ఇవాళ గుజరాత్, బెంగళూర్ ఢీ
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ ఢీకొననున్నాయి. బెంగళూర్ చిన్న స్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 7.30గంటలకు జరగనుంది. రెండు జట్లు బ్యాటింగ్ బలంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఇరు జట్లలోని టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఫామ్‌లో ఉంటే స్టేడియంలో సిక్సర్ల వర్షం ఖాయమని అభిమానులు అంటున్నారు. ఐపీఎల్‌లో ఇరు జట్ల హెడ్-టు-హెడ్ రికార్డు 3-3 తో సమంగా ఉంది.

బెంగళూర్ జట్టు తరఫున విరాట్ కోహ్లీ రెచ్చిపోతున్నాడు. ఈ సీజన్‌లో ఆ జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా అగ్రస్థానంలో నిలిచారు.గుజరాత్ టైటాన్స్‌పై కోహ్లీ ఇప్పటివరకు 344 పరుగులు సాధించి తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. ఇందులో ఒక అద్భుతమైన అజేయ సెంచరీ కూడా ఉంది. కోహ్లీతో పాటు ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పటీదార్, కీలక ఇన్నింగ్స్‌లతో ఈ మ్యాచ్‌ల ఫలితాలను శాసిస్తున్నాడు.

గుజరాత్ కెప్టెన్ శుభమన్‌గిల్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. బౌలింగ్ విభాగంలో గుజరాత్ టైటాన్స్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ కూడా విజయవంతంగా రాణిస్తున్నాడు. గుజరాత్ వైపు నుండి రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ , జోషువా లిటిల్ వంటి బౌలర్లు తమ స్పిన్, వేగంతో బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసి మ్యాచ్ మలుపు తిప్పగలిగే సత్తా ఉన్నవారే. కింగ్ కోహ్లీ బ్యాటింగ్ మెరుపులు, గిల్ క్లాసిక్ షాట్లు, సిరాజ్ పదునైన బంతులు.. ఇలా అన్ని రకాలుగా ఈ పోరు క్రికెట్ అభిమానులకు కనువిందు చేయనుంది. మరి 2026లో ఏ ‘టైటాన్’ గెలుస్తుందో, ఏ ‘ఛాలెంజర్’ సత్తా చాటుతాడో వేచి చూడాలి.
