ఆగి ఉన్న లారీని ఢీకొన్న ట్రావెల్స్‌ బస్సు

ఆగి ఉన్న లారీని ఢీకొన్న ట్రావెల్స్‌ బస్సు

పెళ్లకూరు, ఆంధ్రప్రభ : తిరుపతి జిల్లాలోని పెళ్లకూరు మండలం తాళ్వాయిపాడు జాతీయ రహదారి సర్వీస్‌ రోడ్డులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. బెంగుళూరు నుంచి నెల్లూరుకు 36 మంది ప్రయాణికులతో వెళుతున్న జబ్బర్‌ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు తాళ్వాయిపాడు వద్దకు చేరుకోగానే రోడ్డు పై ఆగిఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న గుర్తుతెలియని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరికొంతమంది ప్రయాణికులు గాయపడ్డారు. మృతుడు శ్రీకాళహస్తి ప్రాంతానికి చెందినవాడిగా పోలీసులు అనుమానిస్తున్నారు.

అతను శ్రీకాళహస్తిలో బస్సు ఎక్కి గూడూరులో దిగుతానని చెప్పినట్లు సమాచారం. మృతుడి ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న డీఎస్పీ చెంచుబాబు, రూరల్‌ సీఐ సంఘమేశ్వరరావు, ఎస్‌ఐ ఆదిలక్ష్మి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. గాయపడిన వారిని నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Leave a Reply