మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల వద్ద రైతులతో ధర్నా

నల్లబెల్లి, ఆంధ్రప్రభ : మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల వద్ద నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటూ నల్లబెల్లి మండల కేంద్రంలో గురువారం రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. మండల అధ్యక్షుడు సారంగపాణి ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొని తమ సమస్యలను వెల్లడించారు. ఈ కార్యక్రమానికి వరంగల్ మాజీ జిల్లా పరిషత్ స్థాయి నాయకుడు పెద్ది స్వప్నసుదర్శన్ రెడ్డి హాజరై రైతులకు మద్దతు తెలిపారు.

ఆయన మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రాల్లో సుమారు 35 వేల మొక్కజొన్న బస్తాలు నిల్వలో ఉన్నప్పటికీ, రవాణా కోసం తగినంత లారీలు లేకపోవడంతో రైతులు గత ఇరవై రోజులుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వం ఎకరాకు కేవలం 25 క్వింటాళ్ల వరకు మాత్రమే కొనుగోలు చేస్తోందని, మిగిలిన దిగుబడిని రైతులు మధ్యవర్తులకు తక్కువ ధరలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

దీంతో రైతులకు గణనీయమైన ఆర్థిక నష్టం కలుగుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంపై సరైన అవగాహన లేకపోవడం వల్లే ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని విమర్శించారు. రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే ధర్నాలు, రహదారి దిగ్బంధాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో మాజీ సహకార వ్యవసాయ సంఘం అధ్యక్షుడు చెట్టుపల్లి మురళిదర్, మాజీ మండల పరిషత్ అధ్యక్షుడు కేక్కర్ల శ్రీనివాస్ గౌడ్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఉడుగుల ప్రవీణ్, మండల ప్రధాన కార్యదర్శి కోటిలింగ చారి, మామిళ్ళ మోహన్ రెడ్డి, రైతు నాయకులు గోపాల్ రెడ్డి, రాజయ్య, యాదగిరి, శ్రీనివాస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.