15yrsgirl | ఆశ్రమంలో గిరిజన బిడ్డ మృతికి బాధ్యులెవరు?

15yrsgirl | ఆశ్రమంలో గిరిజన బిడ్డ మృతికి బాధ్యులెవరు?
15yrsgirl | జ్వరంతో అలమటించిన చిన్నారి..
చివరికి ప్రాణం కోల్పోయింది
న్యాయం కోసం ఆసుపత్రి వద్ద నిరసనలు
అధికారుల హామీలు..
బాధిత కుటుంబానికి సాయం
వ్యవస్థల వైఫల్యం పై ప్రశ్నలు
జైనూర్, ఆంధ్రప్రభ: పదహారేళ్లు కూడా నిండని ఆ పసి ప్రాణం.. తన చదువుతో కుటుంబానికి వెలుగు నిస్తుందని ఆ తల్లిదండ్రులు ఆశపడ్డారు. కానీ, జ్వరం రూపంలో వచ్చిన మృత్యువు ఆ ఆశలను ఆవిరి చేసింది. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన ఈ విషాదం ఇప్పుడు అటు ఆదివాసీ గూడాలను విషాదంలో ముంచెయ్యగా, ఇటు విద్యా శాఖను ఉలిక్కి పడేలా చేసింది. మహాగం బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న కోట్నాక్ గంగుబాయి (15) మృతి కేవలం అనారోగ్యం వల్ల జరిగిందా? లేక వ్యవస్థల నిర్లక్ష్యం వల్ల జరిగిందా? అన్నది ఇప్పుడు సర్వత్రా ప్రశ్నార్థకంగా మారింది.
15yrsgirl | నొప్పిని భరించింది.. గుండె ఆగిపోయింది!
గడిచిన రెండు రోజులుగా గంగుబాయి జ్వరంతో అల్లాడి పోయింది. కన్న వారికి దూరంగా, ఆశ్రమంలో ఉంటున్న ఆ బిడ్డకు సరైన వైద్యం అందించాల్సింది పోయి.. వసతి గృహంలోనే సాధారణ మాత్రలు ఇచ్చి సరి పెట్టారన్న ఆరోపణలు స్థానికుల నుంచి వెల్లువెత్తుతున్నాయి. బుధవారం ఉదయం టిఫిన్ చేసిన వెంటనే ఆ చిన్నారి వాంతులు చేసుకుని కుప్పకూలిపోయింది. ఆశ్రమం హుటాహుటిన జైనూర్ ఆసుపత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే ఆ బిడ్డ ప్రాణం అనంత వాయువుల్లో కలిసి పోయిందని వైద్యులు తేల్చారు. ఆసుపత్రికి తెచ్చే ముందే గంగుబాయి కన్నుమూయడం చూస్తుంటే, పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం పట్ల అనేక సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి.

15yrsgirl | ఆసుపత్రి మెట్లపై ఆక్రందనలు – న్యాయం కోసం నిరసన:
“విషయం తెలుసుకున్న జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుమేత విశ్వనాథ్ రావు, అసిఫాబాద్ గిరిజన సంక్షేమ అభివృద్ధి అధికారిణి (డ్డ్) రమాదేవి, ఉట్నూర్ ఐటీడీఏ ఏపీఓ ఆత్రం భాస్కర్, ఏజెన్సీ విద్యాధికారి (ఆళో), జైనూర్ ఏటీడీఓ శ్రీనివాస్, సిర్పూర్ (యు) మండల విద్యాశాఖ అధికారి (ంఏఓ) కుడిమెత సుధాకర్, మహాగాం పాఠశాల హెచ్ఎం రాంబాయి, డిప్యూటీ వార్డెన్ శ్రీదేవి తదితరులు జైనూర్ ఆసుపత్రిని సందర్శించి విద్యార్థిని మృతదేహాన్ని పరిశీలించారు. అంతకుముందు నిరసన తెలుపుతున్న నాయకులతో అధికారులు మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు.”గంటల తరబడి సాగిన ఈ నిరసనలో తమ బిడ్డ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని చిన్నారి బంధువులు డిమాండ్ చేశారు. “మా బిడ్డకు జ్వరం వస్తే ఆసుపత్రికి ఎందుకు తీసుకెళ్లలేదు?” అన్న చిన్నారి బంధువుల ఆవేదన అక్కడున్నవారందరినీ కంటతడి పెట్టించింది.
అధికారుల హామీ.. తక్షణ సాయం:
పరిస్థితి తీవ్రతను గమనించిన గిరిజన సంక్షేమ శాఖ డివిజనల్ అధికారిణి రమాదేవి, ఐటీడీఏ ఏపీఓ ఆత్రం భాస్కర్ సహా విద్యాశాఖ అధికారులు ఆసుపత్రికి చేరుకున్నారు. నిరసనకారులతో జరిపిన చర్చల అనంతరం.. బాధిత కుటుంబానికి తక్షణ సహాయంగా రూ. 20,000 నగదును అందజేశారు. అలాగే ఆ కుటుంబంలో ఒకరికి అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. 10 లక్షల ఎక్స్గ్రేషియా కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని భరోసా ఇచ్చారు.
“ఉదయం నుండి ఆదివాసీ నాయకులు ధర్నా నిర్వహించి నిరసన తెలపడంతో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జైనూర్ సీఐ రమేష్ మరియు ఎస్సైలు ఆసుపత్రి ప్రాంగణంలో భద్రతను పర్యవేక్షించారు.

అండగా నిలిచిన నాయకులు:
ఈ నిరసన కార్యక్రమంలో మహగాం సర్పంచ్ సెడమకి జానే రావు, ధనోరా మరియు బాబ్జిపేట సర్పంచులు మెస్రం స్పందన, భూపతి మాధవరావు, డీసీసీ కార్యవర్గ సభ్యులు ప్రకాష్, టీఆర్ఎస్ పార్టీ (ప్రస్తుత బీఆర్ఎస్) మండల అధ్యక్షుడు ఇంతియాజ్ లాలా, ఇతర నాయకులు మరియు మృతురాలి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.”
వ్యవస్థ మారేది ఎప్పుడు?
ఒక గంగుబాయి ప్రాణాలు కోల్పోయింది.. అధికారుల నుంచి హామీలు మాత్రం వచ్చాయి. కానీ, ఆశ్రమ పాఠశాలల్లో పిల్లల ప్రాణాలకు భరోసా ఎక్కడ? జ్వరం వచ్చినప్పుడే ఆ చిన్నారికి సకాలంలో వైద్యం అందించి ఉంటే ఈ రోజు ఆ తల్లిదండ్రులకు కడుపు కోత మిగిలేది కాదు కదా! ఒక బిడ్డ మరణం తర్వాత వచ్చే హామీలు ఆ తల్లిదండ్రుల వేదనను చల్లార్చలేవు. ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక నిఘా ఉంచాల్సిన అవసరం ఉందని, ఇకనైనా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.
ఇలాంటి అవాంఛనీయ ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఉత్తుత్తి హామీలు వృథా. ఆశ్రమాల్లో వైద్య సదుపాయాలపై పర్యవేక్షణ పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
click here to read వృద్ధ దంపతుల బలవన్మరణం..
