చేనేత రంగాన్ని విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం

చేనేత రంగాన్ని విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం
మాజీ ఆప్కో డైరెక్టర్ కర్నాటి వెంకటేశం
గట్టుపల, ఆంధ్రప్రభ: చేనేత రంగాన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విస్మరించిందని మాజీ ఆప్కో డైరెక్టర్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కర్నాటి వెంకటేశం తీవ్రంగా విమర్శించారు. మండల కేంద్రంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. 2026-27 వార్షిక బడ్జెట్లో చేనేత కేటాయించింది రూ.240 కోట్ల రూపాయలని, కేవలం ఉద్యోగస్తుల జీతభత్యాలకే తప్ప చేనేత కార్మికులకు ఒరిగేదేమీ లేదని అన్నారు. గత ఎన్నికలలో చేనేతలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, గతంలో ఉన్న చేనేత పథకాలను సంవత్సరకాలం పాటు నిలుపుదల చేయడమేకాక చేనేత వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని అన్నారు.
చేనేత రుణమాఫీ విషయంలో అనేక ఆంక్షలు తీసుకొచ్చిందని, తిఫ్ట్ ఫండ్, చేనేత భరోసా పథకం అతిగతి లేదని అన్నారు. చేనేత సహకార సంఘాలకు ఉన్న క్యాష్ క్రెడిట్ మాఫీ విషయంలో ప్రభుత్వం మౌనం వహిస్తుందని, సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేస్తుందని అన్నారు. తక్షణమే చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించి, కార్మికులకు చేతినిండా పని కల్పించాలని అన్నారు. ఈ సమావేశంలో పున్న కిషోర్, చిలుకూరి అంజయ్య, నారని జగన్, చెరుపల్లి నాగేష్, చెరుపల్లి కృష్ణ, నేలంటి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
