వారసత్వ సంపదను కాపాడుకోవడం మన బాధ్యత..

వారసత్వ సంపదను కాపాడుకోవడం మన బాధ్యత..
- కొండపల్లిలో అట్టహాసంగా బొమ్మల పండుగ ప్రారంభం
- కొండపల్లి ఖిల్లా, బొమ్మలు మన సంస్కృతికి ప్రతిబింబాలు
- హస్తకళాకారులే నిజమైన వారసత్వ సంరక్షకులు
- నూతన ఆవిష్కరణలకు రూ.5 లక్షల ప్రోత్సాహకాలు.
- మైలవరం ఎమ్మెల్యే వసంత
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : కొండపల్లి బొమ్మలు, కొండపల్లి ఖిల్లా మన వారసత్వ సంపదని వీటిని ఆదరించి కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మైలవరం శాసనసభ్యుడు వసంత వెంకట కృష్ణప్రసాద్ అన్నారు. ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకుని కొండపల్లి బొమ్మల కాలనీలో బొమ్మల పండుగను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధతో కలిసి ఎమ్మెల్యే వసంత శనివారం ప్రారంభించారు. ముందుగా జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
స్థానికంగా ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్, బొమ్మల తయారీ ఎక్స్ పీరియన్స్ సెంటర్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా బొమ్మల పండుగను నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇది కేవలం బొమ్మల ప్రదర్శన మాత్రమే కాదని, మన చరిత్రను గుర్తు చేసుకునే రోజు అని, మన వారసత్వాన్ని కాపాడే సంకల్పం అన్నారు. మైలవరం నియోజకవర్గంలో ఉన్న కొండపల్లి ఖిల్లా మన ప్రాంతానికి గర్వకారణమని, మన చరిత్రకు ఖిల్లా ప్రతీకగా నిలుస్తోందన్నారు.

శతాబ్దాల క్రితం నిర్మించబడిన కోట మన సంస్కృతి, మన వైభవం, మన శౌర్యానికి దర్పణం పడుతున్నాయన్నారు. మన సంప్రదాయ కళకు ప్రతీక అయిన ఈ బొమ్మలు కేవలం ఆటబొమ్మలు కాదన్నారు. ఇవి మన సంస్కృతి, మన కళాకారుల ప్రతిభ, మన జీవన విధానాలు ప్రతిబింబిస్తున్నాయన్నారు. తరతరాలుగా వస్తున్న ఈ హస్తకళను కాపాడటం మన బాధ్యత అన్నారు. తాను పాల్గొనే ప్రతి కార్యక్రమంలో కొండపల్లి బొమ్మలను జ్ఞాపికలుగా సమర్పిస్తూ కొండపల్లి బొమ్మలు మార్కెటింగ్ ను ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించారు.

దీనివల్ల కొండపల్లి బొమ్మలపై ఆధారపడి జీవిస్తున్న కళాకారులకు చేయూత లభిస్తుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కొండపల్లి బొమ్మలను విశేషంగా ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించారు. బొమ్మలను తయారు చేసే కళాకారులే మన నిజమైన వారసత్వ సంరక్షకులన్నారు. బొమ్మల కళాకారులను ప్రోత్సహించి వారి జీవనోపాధిని మరింత మెరుగుపర్చేందుకు తన వంతుగా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.

ఈ హస్తకళను యువతలోకి తీసుకెళ్లాలన్నారు. కొండపల్లి బొమ్మల తయారీలో నైపుణ్యత, సృజనాత్మకతో నూతన ఆవిష్కరణలు చేసే వారిని గుర్తించి మొదటి పది స్థానాల్లో నిలిచిన 10 మందికి వచ్చే ఏడాది ఇదే రోజున రూ.50 వేలు చొప్పున రూ.5 లక్షలు బహుకరిస్తామని ప్రకటించారు. కొండపల్లి ఖిల్లా అభివృద్ధి, సంరక్షణ కోసం ప్రణాళికాబద్దంగా కృషి చేస్తామన్నారు. టూరిజం అభివృద్ధితో పాటు మౌలిక వసతుల కల్పన, శుభ్రత, పరిరక్షణ అంశాలపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా ప్రజల భాగస్వామ్యంతోనే వారసత్వాన్ని కాపాడటం సులభమవుతుందన్నారు.

కొండపల్లి ఖిల్లాకు గత ప్రభుత్వంలో చీకటి రోజులు వచ్చాయన్నారు. అంతకు ముందు సీఎం చంద్రబాబు ఇక్కడ లేజర్ షో ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. మన కొండపల్లి ఖిల్లాను కాపాడుకుందాం, మన బొమ్మలను ప్రోత్సహిద్దాం, మన వారసత్వాన్ని గర్వంగా ముందుకు తీసుకెళ్దాం అంటూ మైలవరం నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. మన చరిత్రను కాపాడితేనే మన భవిష్యత్తు బలపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

