BJP MP | తేజస్వీ సూర్య వ్యాఖ్యలపై దుమారం…

BJP MP | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనను భారత్-పాక్ విభజనతో పోలుస్తూ బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య లోక్‌సభలో చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. తెలంగాణ అస్తిత్వాన్ని, కోట్లాది మంది ప్రజల దశాబ్దాల ఉద్యమాన్ని అవమానించేలా బీజేపీ నేతల తీరు ఉందంటూ తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మండిపడ్డారు. ఈ మేరకు శుక్రవారం పార్లమెంట్ ఆవరణలో వారు భారీ నిరసన చేపట్టారు.
అసలేం జరిగింది?
లోక్‌సభలో డీలిమిటేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా తేజస్వీ సూర్య మాట్లాడుతూ.. గత యూపీఏ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను అత్యంత దారుణంగా విభజించిందని ఆరోపించారు. ఈ విభజనను బ్రిటీష్ వారు చేసిన భారత్-పాకిస్తాన్ విభజనతో పోల్చడమే కాకుండా, ఇది కాంగ్రెస్ పార్టీ రక్తం లోనే ఉందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసిన తేజస్వీ సూర్యతో పాటు, పక్కనే ఉండి ఈ వ్యాఖ్యలను అడ్డుకోని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
“తెలంగాణ ఉద్యమాన్ని బీజేపీ అవమానించవద్దు” అంటూ రాసి ఉన్న ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేశ విభజనలాంటి రక్తపాతంతో కూడిన ఘట్టాన్ని, తెలంగాణ ప్రజల ప్రజాస్వామ్యయుత ఆకాంక్షతో కూడిన విభజనతో పోల్చడంపై అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ నేతలు నిన్నటి నుంచి నిరసనలు కొనసాగిస్తున్నారు.
ఎంపీ తేజస్వీ సూర్య తన వ్యాఖ్యలను ఉపసంహరించుకునే వరకు పోరాటం ఆపబోమని కాంగ్రెస్ ఎంపీలు స్పష్టం చేశారు. ఈ పరిణామంతో పార్లమెంట్ ఉభయ సభల్లోనూ తెలంగాణ సెగ రాజుకుంది.
