పునర్విభజనతో దక్షిణాదికి అన్యాయం..

పునర్విభజనతో దక్షిణాదికి అన్యాయం..

  • రాజకీయ ప్రాధాన్యతను తగ్గించే కుట్ర
  • బీజేపీ మంత్రులు ఈ విషయంపై స్పందించరేమి?
  • హ‌రీశ్‌రావు ఆరోప‌ణ‌ల‌కు విలువే లేదు…
  • మంత్రి పొంగులేటిపై ఆరోపణలు నిరాధారం..
  • త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తే.. త‌గిన స‌మాధాన‌మిస్తాం..
  • టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి..

సంగారెడ్డి ప్ర‌తినిధి, ఆంధ్రప్ర‌భ : నియోజకవర్గాల పునర్విభజన విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగనుంద‌ని టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిజమేనని జగ్గారెడ్డి స్ప‌ష్టం చేశారు. ఈ పునర్విభజన ద్వారా దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాధాన్యతను తగ్గించే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు.

బీజేపీ మంత్రులు ఈ విషయంపై స్పందించలేకపోతున్నారని విమర్శించిన ఆయన, కాంగ్రెస్‌లో ఉన్నట్లుగా తమ అభిప్రాయాలను వ్యక్తపరిచే స్వేచ్ఛ బీజేపీలో లేదన్నారు. ఇక బీజేపీ నేత బండి సంజయ్ వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ఆయన విమర్శలకే పరిమితమై ఉన్నారని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

హ‌రీశ్‌రావు ఆరోప‌ణ‌ల‌కు విలువే లేదు…

బీఆర్ఎస్ నేత హరీష్‌రావు చేసిన ఆరోపణలకు విలువ లేదని, సంగారెడ్డి, పటాన్‌చెరు ప్రాంతాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూదందాలు చేశారన్న ఆరోపణలు నిరాధారమని స్పష్టం చేశారు. ఎవరి మీదైనా ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం రాజకీయాల్లో సహజమైందని పేర్కొన్నారు. సీతక్కపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు అర్ధరహితమని, వాటిలో ఎలాంటి నిజం లేదని అన్నారు. టెండర్ విధానం లేకుండా ఫోన్లు కొనుగోలు చేశారన్న ఆరోపణలు పూర్తిగా తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు.

కేబినెట్‌లో ఇద్ద‌రుంటే త‌ప్పేమిటి?

కేబినెట్‌లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇద్దరూ ఉండటంలో ఎలాంటి తప్పు లేదని, దీనిపై ముఖ్యమంత్రికి కూడా తాను ఇదే అభిప్రాయం చెప్పనున్నట్లు తెలిపారు. పీసీసీ అధ్యక్ష పదవిపై జరుగుతున్న చర్చలను ప్రస్తావిస్తూ, మహేష్‌గౌడ్ పేరు తానే ప్రతిపాదించానని, అందరి మద్దతుతోనే ఆయన ఆ పదవిలోకి వచ్చారని పేర్కొన్నారు. కులాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు చేయవద్దని, అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.

సంగారెడ్డి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలపై మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల కారణంగా జిల్లాకే పరిమితమయ్యానని, పార్టీ కార్యకర్తల కోసం కష్టపడ్డానని చెప్పారు. ఇప్పటివరకు 10 వేల మందికి ఇళ్ల స్థలాలు అందించామని, మరో 15 వేల మందికి ఇవ్వడానికి చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. దీనిపై కలెక్టర్‌కు ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయని వెల్లడించారు. సీఎం రేవంత్‌రెడ్డిని సంగారెడ్డికి ఆహ్వానించామని, ఈ నెల 30 లేదా మేలో ఆయన పర్యటన ఉండే అవకాశముందని చెప్పారు.

అభివృద్ధి పనులపై ఈ నెల 21న సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. రాజకీయాల్లో డబ్బు ప్రాధాన్యం పెరిగిందని, ఎమ్మెల్యే గెలవాలంటే భారీగా ఖర్చు అవుతోందని వ్యాఖ్యానించారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఈ విషయాలపై ఎవరూ ప్రశ్నించలేదని విమర్శించారు. హరీష్‌రావు మళ్లీ ఆరోపణలు చేస్తే తగిన సమాధానం ఇస్తామని, అవసరమైతే వారి వ్యవహారాలనూ బయటపెడతామని జగ్గారెడ్డి హెచ్చరించారు.

Leave a Reply