ఇంటర్ ఫలితాల్లో బెల్లంపల్లి విద్యార్థిని మెరుపులు..

ఇంటర్ ఫలితాల్లో బెల్లంపల్లి విద్యార్థిని మెరుపులు..
బైపీసీలో స్టేట్ థర్డ్ ర్యాంక్!
440కి 436 మార్కులు సాధించిన అడ్డూరి లహరి
భవిష్యత్తులో డాక్టర్‌గా సేవ చేయడమే లక్ష్యమన్న లహరి
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన విద్యార్థిని అడ్డూరి లహరి అద్భుత ప్రతిభ కనబరిచింది. బైపీసీ విభాగంలో రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకు సాధించి జిల్లా పేరును రాష్ట్ర స్థాయిలో నిలబెట్టింది. హైదరాబాద్‌లోని శ్రీ చైతన్య కళాశాలలో చదువుతున్న లహరి, మొదటి సంవత్సరంలో 440 మార్కులకు గాను 436 మార్కులు సాధించి ఈ ఘనత సాధించింది. బెల్లంపల్లి పట్టణంలోని కన్నాలబస్తీకి చెందిన అడ్డూరి లహరి తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులు.
తల్లి కీర్తన వరంగల్‌లోని పాండు అకౌంట్స్ ఆఫీసులో సూపరింటెండెంట్‌గా పనిచేస్తుండగా, తండ్రి అభిలాష్ ఆసిఫాబాద్ జిల్లా దయాగం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తమ కుమార్తె రాష్ట్రస్థాయిలో ర్యాంకు సాధించడంపై వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లక్ష్యం.. ప్రజా సేవ: ఈ సందర్భంగా స్టేట్ ర్యాంకర్ లహరి మాట్లాడుతూ.. ప్రణాళికాబద్ధంగా కష్టపడి చదవడం వల్లే ఈ ఫలితం దక్కిందని పేర్కొన్నారు.
తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువుల బోధన తన విజయానికి దోహదపడ్డాయని తెలిపారు. భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివి, డాక్టర్‌గా మారి సమాజానికి సేవ చేయడమే తన జీవిత లక్ష్యమని లహరి ఆకాంక్షించారు. లహరి సాధించిన ఈ విజయం పట్ల స్థానికులు, బంధుమిత్రులు అభినందనలు కురిపిస్తున్నారు.
