దోపిడీ రహిత సమాజం కోసం నిరంతర పోరాటాలు

దోపిడీ రహిత సమాజం కోసం నిరంతర పోరాటాలు
- సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నరసింహ
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : నిరంతరం ప్రజల పక్షాన నిలబడి, దోపిడీ రహిత సమాజ నిర్మాణం సీపీఐ బలమైన పోరాటాలు చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నరసింహ అన్నారు. ప్రజలకు మరింత చేరువయ్యే లక్ష్యంతో రాష్ట్ర సమితి పిలుపు మేరకు ‘ఇంటింటికి సీపీఐ’ కార్యక్రమాన్ని శనివారం సంగారెడ్డి పట్టణంలో నరసింహ ప్రారంభించారు. పార్టీ బలోపితానికి ఇంటింటికీ విరాళాలు స్వీకరించారు.
ఈ సందర్బంగా నరసింహ మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం పరితపించిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కేవల్ కిషన్ ఉద్యమ స్పూర్తితో ఉమ్మడి జిల్లాలో అనేక భూపోరాటాలు చేశామని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలను గాలికొదిలేసి తమ ఉనికి కోసం పాకులాడుతున్నారని విమర్శించారు. భూమి, ఇళ్లులేని నిరుపేదలకు భూమి, ఇళ్ల కోసం మౌలిక సౌకర్యాల కల్పన వంటి ప్రజాసమస్యలపై సీపీఐ నిరంతరం పోరాటాలు చేస్తూ ప్రజలకు అండగా ఉంటుందని ఈటీ నరసింహ తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి సయ్యద్ జలాలుద్దీన్, జిల్లా సహాయ కార్యదర్శిలు ఆనంద్, ఎంఏ రెహమాన్, సంగారెడ్డి టౌన్ కార్యదర్శి మహబూబ్ ఖాన్, డీహెచ్ పీఎస్ జిల్లా కన్వీనర్ గడ్డం కిరణ్ కుమార్, నేతలు సీహెచ్ కాశీనాథ్, అశోక్, రుబేన బేగం, కళావతి, లక్ష్మి,సతీష్ ,లింగం, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
