24 నెలలుగా కొనసాగుతున్న అక్రమ అరుణ గోదాం నిర్మాణం..

24 నెలలుగా కొనసాగుతున్న అక్రమ అరుణ గోదాం నిర్మాణం..
- చర్యలు తీసుకోవాలని హైడ్రాకు ఎల్లంపేట మునిసిపల్ స్థానిక ప్రజల విన్నపం..
- పట్టించుకోని కమిషనర్ టౌన్ ప్లానింగ్ విభాగం..
మేడ్చల్, ఆంధ్రప్రభ : మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని మేడ్చల్ మండలం ఎల్లంపేట్ మున్సిపాలిటీలో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న భారీ అరుణ గోదాం నిర్మాణంపై స్థానిక ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని అరుణ గోదాం నిర్మాణం గత 24 నెలలుగా నిరంతరాయంగా పనులు కొనసాగుతున్నప్పటికీ, అడ్డుకోవాల్సిన అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.
గడిచిన 24 నెలలుగా ఈ నిర్మాణ పనులు జరుగుతున్నా, మున్సిపల్ అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూడకపోవడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో, ఇటీవల అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా (HYDRAA) అధికారులు ఈ విషయంపై తక్షణమే స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, నిబంధనలు ఉల్లంఘించి నిర్మిస్తున్న ఈ గోదాంపై కఠిన చర్యలు తీసుకోవాలని, మున్సిపల్ అధికారుల ఉదాసీనతపై కూడా దర్యాప్తు చేయాలని ఎల్లంపేట్ మున్సిపల్ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
