ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు..

నిజామాబాద్ స్పోర్ట్స్, ఆంధ్రప్రభ ; ఆర్మూర్ లోని విశాఖ నగర్ లో గల నవ్యభారతి స్కూల్ లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలను ఘనంగా, ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. విద్యార్థులు తమ విద్యా ప్రయాణంలో ఒక ముఖ్యమైన దశను పూర్తిచేసుకుని తదుపరి ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పాఠశాల చైర్మన్ సంతోష్ కుమార్ , ప్రిన్సిపల్ శ్రీనివాస్ మార్గదర్శకత్వంలో జరిగిన ఈ కార్యక్రమం ఎంతో ఆకర్షణీయంగా సాగింది.

గ్రాడ్యుయేషన్ దుస్తుల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని సర్టిఫికెట్లు స్వీకరించడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థుల ముఖాల్లో ఆనందం, గర్వం, ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపించాయి. తమ కృషి ఫలితంగా ఈ ఘట్టాన్ని చేరుకున్నందుకు విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ సంతోష్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి చదివి విజయాలు సాధించాలని సూచించారు. పాఠశాలలో పొందిన విలువలను జీవితాంతం పాటిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలవాలని అన్నారు.

ప్రిన్సిపల్ శ్రీనివాస్ మాట్లాడుతూ… విద్యార్థులు నూతన సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని తమ ప్రతిభను చాటుకోవాలని ప్రోత్సహించారు. కార్యక్రమంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొని విద్యార్థుల విజయాలను అభినందించారు. పిల్లల సాధన చూసి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేయగా, ఉపాధ్యాయులు విద్యార్థుల కృషిని ప్రశంసించారు. చప్పట్ల నడుమ విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. ఆనందోత్సాహాల మధ్య సాగిన ఈ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు చిరస్మరణీయంగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply