Cyber fraudsters | “వికసిత్ భారత్” పేరుతో….

Cyber fraudsters | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : సైబర్ మోసగాళ్ల బారిన ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు కూడా పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సైతం మోసగాళ్ల వలలో చిక్కి డబ్బులు కోల్పోయారు.
తెలంగాణ రాష్ట్రంలోని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సైబర్ మోసానికి గురయ్యారు. “వికసిత్ భారత్” పథకం పేరుతో ఓ వ్యక్తి ఆయనను నమ్మించి డబ్బులు కాజేశాడు.
అర్హుల జాబితా పంపిస్తే ఒక్కొక్కరికి రూ.10 లక్షల రుణాలు మంజూరు చేస్తామని నిందితుడు చెప్పి ఎమ్మెల్యేను నమ్మించాడు. ఇందుకోసం ఒక్కొక్కరికి రూ.2,500 చొప్పున ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని సూచించాడు.ఈ క్రమంలో మొత్తం రూ.1 లక్షను ఫోన్‌పే ద్వారా ఎమ్మెల్యే పంపించారు.
అయితే అనంతరం మళ్లీ డబ్బులు పంపాలని కోరడంతో అనుమానం వచ్చిన పల్లా రాజేశ్వర్ రెడ్డి, తాను మోసపోయినట్లు గ్రహించారు. వెంటనే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
