4thAprilCartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా

4thAprilCartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా

4thAprilCartoon | హోర్ముజ్ ఉద్రిక్తతలు… ప్రపంచాన్ని వణికిస్తున్న పరిస్థితి
భారత్‌కు చమురు సరఫరా… ఎలా సాధ్యమైంది?
ట్రంప్ దురాలోచన విఫలం… దౌత్యంలో భారత్ గెలుపు
చిన్న దేశాలకు భారత్ ఆశాకిరణమా?
బంగ్లాదేశ్‌కు సాయం… తదుపరి లక్ష్యం శ్రీలంక?

4thAprilCartoon
4thAprilCartoon

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ప్రపంచమంతా చమురు దాహంతో అల్లాడుతోంది. అందులో కొన్ని దేశాలు తప్ప.

హోర్ముజ్ జలసంధి మూసేయడం… పశ్చిమాసియాలో యుద్ధం… ఇలా రకరకాల ఉద్రిక్త పరిస్థితుల మధ్య ప్రపంచ దేశాలన్నీ రేపటి రోజు ఎలా ఉండబోతుందోనని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్ళదీస్తున్నాయి.

అయితే భారత్ మాత్రం ఈ కొరతను చాలావరకు అధిగమించినట్టేనని చెప్పవచ్చు. ఇది ఒకరకంగా దౌత్య విజయం. అటు ఇరాన్‌తోనూ, ఇటు రష్యాతోనూ సత్సంబంధాలు కలిగి ఉండడం, స్నేహాన్ని నెరపడం కారణం.

హోర్ముజ్ జలసంధిలో కూడా భారత్‌కు వెళ్లే నౌకలకు మాత్రం ఎలాంటి అడ్డూ లేకుండా అవలీలగా, సునాయాసంగా దారి వదిలారు. అవి సకాలంలోనే భారత్‌కు చేరుకున్నాయి.

భారత్ చమురు కొరతతో అల్లాడితే ఈరకంగానైనా భారత్‌ను సుంకాల పేరుతో లొంగదీసుకోవాలనుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దురాలోచన కాస్తా కలగానే మిగిలిపోయింది.

ఇక పెద్ద పెద్ద దేశాలన్నీ ఇలా తలపడుతుంటే, చిన్న చిన్న దేశాలు మాత్రం ఎవరితో కలవాలో… ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నాయి. వాటికి ప్రపంచ దేశపటంలో పెద్దగా ఉనికి లేకపోవడమే కారణం.

అసలే అంతర్యుద్ధాలతో అల్లాడిపోతుంటే, అంతర్జాతీయంగా ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య తమ రోజువారీ అవసరాలు ఎలా నిర్వహించుకోవాలో అర్థం కావడం లేదు.

వాటన్నిటికీ భారత్ ఒక పెద్ద దిక్కులాగా కనిపించింది. వాటిలో భారత్ పొరుగునే ఉన్న భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక తదితర చిన్న చిన్న దేశాలన్నీ ఉన్నాయి.

అతి త్వరలో బంగ్లాదేశ్‌కు చమురు సాయం అందించబోతున్నట్టు భారత్ సూత్రప్రాయంగా ప్రకటించింది కూడా. మరి శ్రీలంక తదితర దేశాల పట్ల ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఇదే పరిస్థితిని చూపించిన ఆంధ్రప్రభ కార్టూన్ ఇది.

గత రెండు దశాబ్దాలుగా ఆంధ్రప్రభ పాఠకులను, కార్టూన్ ఇష్టులను అలరిస్తోన్న కార్టూన్ ఫీచర్ “ఔరా”.