నిడుగుర్తిలో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; ఏకగ్రీవ గ్రామపంచాయతీ అభివృద్ధిలో ఆదర్శంగా నిలవాలని ఊట్కూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు డి. యగ్నేశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని నిడుగుర్తి లో ఉపాధి హామీ పథకంలో రూ 10 లక్షల నిధులతో సిసి రోడ్డు పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం గ్రామాల అభివృద్ధికి శ్రీకారం చుట్టిందన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి సహకారంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్న నిడుగుర్తి గ్రామానికి ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామనిఅన్నారు.

ఊట్కూర్ మండలంలో సర్పంచ్ ఎన్నికల్లో నిడుగుర్తి, తిమ్మారెడ్డిపల్లి తండా, ఎర్గాటుపల్లి గ్రామపంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తుందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పారదర్శకంగా అర్హులైన పేదవారికి మంజూరు చేయాలన్నారు. పార్టీలకతీతంగా గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. సర్పంచ్ రాములు మాట్లాడుతూ ప్రజలు తనకిచ్చిన అవకాశాన్ని వరంగా భావించి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని అన్నారు.

గ్రామంలో నెలకొన్న వివిధ సమస్యలు దశలవారీగా పరిష్కరించి గ్రామ సర్వతోముకాభివృద్ధికి పాటుపడతాననిఅన్నారు. గ్రామంలో డ్రైనేజీలు సిసి రోడ్లు వేసవిలో నీటి ఎద్దడి విద్యుత్ సమస్య రాకుండా చూస్తానని అన్నారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కుర్వ సంతోష్, మాజీ ఎంపీటీసీ కృష్ణార్జునరెడ్డి, నాయకులు నారాయణరెడ్డి, మధుసూదన్ రెడ్డి, కుర్వ అంజప్ప, రవికుమార్,అర్ఫాత్, తదితరులు పాల్గొన్నారు.