భూతగాదా కత్తిపోటుకు దారి.. యువకుడికి తీవ్ర గాయాలు
భూతగాదా కత్తిపోటుకు దారి.. యువకుడికి తీవ్ర గాయాలు
చిట్యాల, ఆంధ్రప్రభ:
మండలంలోని కొత్తపేట గ్రామంలో పాత భూతగాదా కత్తిపోటుకు దారితీసిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడగా, మెరుగైన చికిత్స కోసం హనుమకొండకు తరలించారు. గ్రామస్తుల కథనం ప్రకారం, కొత్తపేట గ్రామానికి చెందిన ఎండి రాజ్ మహమ్మద్‌కు అదే గ్రామానికి చెందిన నరేష్‌తో గత కొంతకాలంగా మనస్పర్థలు ఉన్నాయి. ఆదివారం గ్రామంలో మట్టి తరలింపు విషయంలో ట్రాక్టర్లకు సంబంధించిన వివాదం తలెత్తడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
ఈ క్రమంలో ఆవేశానికి లోనైన నరేష్ కత్తితో రాజ్ మహమ్మద్‌పై దాడి చేసినట్లు సమాచారం. దాడిలో గాయపడిన రాజ్ మహమ్మద్‌ను కుటుంబ సభ్యులు వెంటనే చిట్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం పరిస్థితి దృష్ట్యా హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై పోచంపల్లి సతీష్ తెలిపారు.
