చెంచు గిరిజనుల జీవనోపాధికి టీజీఎల్పీ కీలకం

చెంచు గిరిజనుల జీవనోపాధికి టీజీఎల్పీ కీలకం
- కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
నాగర్కర్నూల్ , ఆంధ్రప్రభ: నాగర్కర్నూల్ జిల్లా ఆదివాసి గిరిజన, అత్యంత పేద, వెనుకబడిన వర్గాల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న తెలంగాణ ఇన్క్లూజివ్ లైవ్లీహుడ్స్ ప్రోగ్రాం (TGILP)ను సమర్థవంతంగా అమలు చేయడం ముఖ్యమని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అన్నారు.
శుక్రవారం అచ్చంపేట నియోజకవర్గంలోని మల్లాపూర్ పెంట గ్రామాన్ని కలెక్టర్ సందర్శించి, అత్యంత పేదరికంలో జీవిస్తున్న 34 చెంచు కుటుంబాలతో సమావేశమయ్యారు. కుటుంబాల జీవన విధానం, ఉపాధి అవకాశాలు, ఆరోగ్యం, విద్య, తాగునీటి సౌకర్యాలు వంటి అంశాలపై వివరణాత్మక అవగాహన తీసుకున్నారు.
కలెక్టర్ పాటిల్ మాట్లాడుతూ, తరతరాలుగా అడవుల ఆధారంగా జీవిస్తున్న చెంచు కుటుంబాలను ఆర్థిక మరియు సామాజికంగా అభివృద్ధిలోకి తీసుకురావడం ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు. TGILP ద్వారా ఎంపిక చేసిన కుటుంబాలకు స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించి, వారిని స్వయం ఆదాయాన్ని పొందే స్థాయికి చేరవేయాలని సూచించారు.
ప్రతి కుటుంబానికి వారి సామర్థ్యాలు, ఆసక్తులను ఆధారంగా చేసుకుని ప్రత్యేక జీవనోపాధి ప్రణాళికలు సిద్ధం చేయాలని, పశుపోషణ, కోళ్ల పెంపకం, చిన్న వ్యాపారాలు, అటవీ ఉత్పత్తుల ఆధారిత ఉపాధి, వ్యవసాయ అనుబంధ రంగాల్లో శిక్షణలు ఇవ్వాలని ఆదేశించారు. చెంచు మహిళల ఆర్థిక సాధికారతకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కూడా తెలిపారు.
అదనంగా, మల్లాపూర్ పెంటలో మౌలిక సౌకర్యాల కొరతపై దృష్టి సారించి తాగునీరు, విద్యుత్, రహదారులు, ఆరోగ్య, విద్యా సౌకర్యాల అభివృద్ధి కోసం సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పిల్లల విద్య కోసం ఆశ్రమ పాఠశాలలు, గురుకులల్లో ప్రవేశాలు కల్పించడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన చెంచు కుటుంబాలకు చేరేలా క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడం ముఖ్యమని పేర్కొన్నారు.
కలెక్టర్ చివరగా, ప్రభుత్వ లక్ష్యం కేవలం సహాయం అందించడం మాత్రమే కాకుండా, ప్రతి చెంచు కుటుంబం గౌరవప్రదమైన జీవితం గడపగల స్థాయికి తీసుకెళ్లడమేనని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పిడి చిన్న ఓబులేష్, అచ్చంపేట ఆర్డీవో యాదగిరి, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
