Kavitha | నియంత్రణ చట్టం తేవాలని డిమాండ్

Kavitha | నియంత్రణ చట్టం తేవాలని డిమాండ్

Kavitha | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో స్కూల్ ఫీజుల పెంపు అంశంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేట్ విద్యాసంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆరోపిస్తూ, ప్రభుత్వం తక్షణమే ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో మొత్తం 39,640 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయని, వీటిలో 12,061 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయని కవిత తెలిపారు. ముఖ్యంగా సీబీఎస్సీ సిలబస్ ఉన్న స్కూల్స్‌లో 25 నుంచి 30 శాతం వరకు ఫీజులు పెంచి ఇప్పటి నుంచే వసూలు చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు మాట్లాడారని గుర్తుచేశారు. అయితే ఇప్పుడు అసెంబ్లీలో ఇతర విషయాలపై చర్చిస్తున్నారే తప్ప, ఫీజుల నియంత్రణపై దృష్టి పెట్టడం లేదని ఆక్షేపించారు.

ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి వెంటనే ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని కవిత డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని అన్నారు. ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు ఫీజులు పెంచుతున్నప్పటికీ టీచర్లకు మాత్రం సరైన జీతాలు ఇవ్వడం లేదని విమర్శించారు. అలాగే ప్రైవేట్ కాలేజీల్లో ఆహార నాణ్యతను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.

ప్రైవేట్ పాఠశాలలు, ఆసుపత్రులను సీఎం స్వయంగా ప్రారంభిస్తున్నారని, వారి దోపిడీని ప్రోత్సహిస్తున్నారా అని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే స్కూల్స్ ముందు ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అన్ని శాఖలకు ముఖ్యమంత్రే మంత్రిగా ఉండటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ హయాంలో తనను నిజామాబాద్‌కే పరిమితం చేశారని పేర్కొన్న కవిత, ఇతర రాష్ట్రాల వారితో పాటు తెలంగాణ వారికి కూడా విద్యాసంస్థల స్థాపనలో సమాన అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

Leave a Reply