చౌటుప్పల్ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో అవకతవకలు

చౌటుప్పల్ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో అవకతవకలు
- ఎన్నికల అధికారులు అమ్ముడుపోయారు
- విచారించి బార్ అసోసియేషన్ ను రద్దు చేయాలి
- బార్ కౌన్సిల్ కు న్యాయవాదులు ఫిర్యాదు
చౌటుప్పల్, ఆంధ్రప్రభ ; యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ కోర్టు బార్ అసోసియేషన్ కు ఈ నెల 26వ తేదీన జరిగిన ఎన్నికల్లో భారీగా అవకతవకలు జరిగాయని, ఎన్నికల అధికారులు కానుగుల వెంకటయ్య, సిహెచ్ రాధా కిషన్ రావు లు అమ్ముడుపోయారని ఆరోపిస్తూ న్యాయవాదులు వాకిటి నరసింహారెడ్డి, పాల పరమేష్, ఏ రంగారెడ్డిలు బుధవారం తెలంగాణ బార్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చౌటుప్పల్ కోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికల అధికారులుగా వ్యవహరించిన కానుగుల వెంకటయ్య, సిహెచ్ రాధాకిషన్ రావులు రెండు బ్యాలెట్ బుక్కులను ప్రింట్ చేయించి, సంతకాలు సైతం పెట్టి, ఒక బ్యాలెట్ బుక్కును ఒక వర్గం వారికి ఇచ్చి సహకరించాలని ఆరోపించారు.
ఒక న్యాయవాది వద్ద డమ్మీ బ్యాలెట్ పేపర్ దొరకడం, అందులో స్వస్తిక్ గుర్తు ఉండడంతో తమకు అనుమానం వచ్చిందని స్పష్టం చేశారు. తాము వెంటనే ఎన్నికల అధికారులను సంప్రదించి, ఒక అధికారి సంతకం మాత్రమే ఉంది, రెండో అధికారి సంతకం పెట్టాలని, బయట నుంచి వచ్చే బ్యాలెట్ పేపర్లను ఆపవచ్చని చెప్పినా, వారు తమ మాటను లెక్క చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ఓటరు తన నడుము వద్ద సెల్ ఫోన్ పెట్టుకోవడం, అది వీడియో కాల్ ఆన్ లో ఉండడం గమనించి, ఆ ఫోన్లో ఎన్నికల అధికారికి ఇవ్వగా, సీజ్ చేయకుండానే తిరిగి అతనికి ఇచ్చారని పేర్కొన్నారు.
అనంతరం ఓట్ల లెక్కింపు సమయంలో స్వస్తిక్ గుర్తులు వేరువేరుగా ఉండటం, ఇంకు డిఫరెంట్ గా ఉండటం, బ్యాలెట్ పేపర్లు ఎక్కువగా ముడతలు పడటం గమనించి తాము అభ్యంతరం వ్యక్తం చేసి, రాతపూర్వకంగా ఫిర్యాదు చేశామన్నారు. బ్యాలెట్ పేపర్లు, స్వస్తిక్ గుర్తులు, ఇంకు ప్యాడ్ లను సీజ్ చేయాలని కోరమన్నారు. ఎన్నికల అధికారులు తమ ఫిర్యాదును తీసుకోలేదని, మెటీరియల్ ను సైతం సీజ్ చేయకుండా వదిలేశారన్నారు.
దీంతో ఎన్నికల అధికారులు అమ్ముడు పోయినట్లుగా ధృవపడిందని స్పష్టం చేశారు. ఎన్నికల అధికారులు తమ బండారం బయటపడుతుందనే మెటీరియల్ ను సీజ్ చేయలేదని పేర్కొన్నారు. తెలంగాణ బార్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేస్తూ చౌటుప్పల్ కోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికను రద్దుచేసి, మరల ఎన్నిక జరపాలని, ఎన్నికల అధికారులైన కానుగుల వెంకటయ్య, సిహెచ్ రాధా కిషన్ రావులపై విచారణ జరిపి, వారిని బార్ కౌన్సిల్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
