పాడి రైతులకు భారీ లాభం…

పాడి రైతులకు భారీ లాభం…

కృష్ణా మిల్క్ యూనియన్ కీలక నిర్ణయం
పాల సేకరణ ధర పెంపు, బోనస్ చెల్లింపులు..
దేశంలోనే అత్యధిక ధర చెల్లిస్తున్న సమితిగా గుర్తింపు..

ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : పాడి రైతుల ఆర్థికాభివృద్ధికి పెద్ద ఊతమిచ్చే నిర్ణయంగా కృష్ణా మిల్క్ యూనియన్ 36వ సర్వసభ్య సమావేశంలో పాల సేకరణ ధర పెంపుతో పాటు బోనస్ చెల్లింపులపై కీలక నిర్ణయాలు తీసుకుంది. యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రైతులకు దేశంలోనే అత్యధిక చెల్లింపులు అందిస్తున్నామని ప్రకటించారు. ఈ సర్వసభ్య సమావేశంలో 10% వెన్న గల పాలకు కేజీ ప్యాట్‌కు రూ.30 పెంపుతో రూ.850గా నిర్ణయించగా, ఆవు పాల టోటల్ సాలిడ్స్‌కు రూ.20 పెంపుతో రూ.310గా నిర్ణయించారు. ఈ పెంపు ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి రానుంది. బోనస్‌తో కలిపి కేజీ ప్యాట్‌కు రూ.935 చెల్లించనున్నట్లు వెల్లడించారు.

బోనస్ చెల్లింపుల్లో ముందంజ..

పాడి రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్న కృష్ణ మిల్క్ యూనియన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి మూడవ విడతగా డిసెంబర్ 2025 నుంచి మార్చి 2026 వరకు 10% బోనస్ కింద సుమారు రూ.15 కోట్లు రైతులకు ఏప్రిల్‌లో చెల్లించనున్నట్లు కృష్ణ మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు తెలిపారు. మొత్తం మూడు విడతలుగా రూ.45 కోట్ల బోనస్ ఇప్పటికే అందించినట్లు వెల్లడించారు.

7 ఏళ్లలో విశేష వృద్ధి..

కృష్ణ మిల్క్ యూనియన్ గత ఏడేళ్లలో గణనీయమైన ప్రగతిని సాధించింది. టర్నోవర్ రూ.716 కోట్ల నుంచి రూ.1265 కోట్లకు (77% వృద్ధి) చెరి భారీ వృద్ధి నమోదు చేసింది. మిగులు నిధులు రూ.96 కోట్ల నుంచి రూ.250 కోట్లకు చేరడంతోపాటు, స్థిరాస్తులు రూ.64 కోట్ల నుంచి రూ.320 కోట్లకు చేరుకున్నాయి. వార్షిక స్థూల లాభం రూ.75 కోట్ల నుంచి రూ.137 కోట్లకు పెరిగినట్లు చలసాని ఆంజనేయులు వివరించారు

సేంద్రియ వ్యవసాయం, సోలార్ ప్రాజెక్ట్ దిశగా అడుగులు..

గ్రామాలను సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లించే దిశగా యూనియన్ చర్యలు తీసుకుంటోందని చలసాని ఆంజనేయులు తెలిపారు. విద్యుత్ వ్యయాన్ని తగ్గించేందుకు 10 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పశువుల వసతిశాలల ఏర్పాటు వంటి పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తున్న నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడు, కొణిదెల పవన్ కళ్యాణ్, కింజరాపు అచ్చెన్నాయుడులకు యూనియన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.

రైతు సంక్షేమమే లక్ష్యం..

పాడి రైతుల ఆదాయం పెంపుతో పాటు పశువుల సంరక్షణ, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మరింత అభివృద్ధి దిశగా కృషి కొనసాగిస్తామని యూనియన్ అధ్యక్షుడు జలసాని ఆంజనేయులు తెలిపారు. ఈ సమావేశంలో మేనేజింగ్ డైరెక్టర్ కొల్లి ఈశ్వరబాబు, పాలకవర్గ సభ్యులు, ట్రస్ట్ సభ్యులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply