క్రికెట్ బెట్టింగ్‌పై కఠిన చర్యలు తప్పవు…
క్రికెట్ బెట్టింగ్‌పై కఠిన చర్యలు తప్పవు…
జిల్లా ఎస్పీ తుషార్ డూడి హెచ్చరిక…
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : దేశవ్యాప్తంగా ఐపీఎల్ ప్రారంభమైన నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్ కార్యకలాపాలు పెరిగే అవకాశమున్నందున, వాటిలో పాల్గొనే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ తుషార్ డూడి స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రజలకు, ముఖ్యంగా యువతకు ఆయన హెచ్చరిక జారీ చేశారు.
ఎస్పీ మాట్లాడుతూ క్రికెట్‌ను ఇష్టపడటం తప్పు కాదు, కానీ బెట్టింగ్ వ్యసనంగా మారితే అది జీవితాన్ని నాశనం చేస్తుందని అన్నారు. బెట్టింగ్‌లో ఓటమి కేవలం వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా కుటుంబాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని, అప్పులు, మానసిక ఒత్తిడి, కుటుంబ విభేదాలు వంటి సమస్యలకు దారితీస్తుందని వివరించారు. కొన్నిసార్లు బెట్టింగ్‌లో భారీ నష్టాల వల్ల వ్యక్తులు ఆత్మహత్యలకు కూడా పాల్పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే గ్యాంగ్‌లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బెట్టింగ్ నిర్వహించడం, ప్రోత్సహించడం లేదా పాల్గొనడం నేరమని, ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
బెట్టింగ్ ఎప్పుడూ నష్టమే – చివరికి జీవితాన్ని, కుటుంబాన్ని, భవిష్యత్తును కూల్చేస్తుంది. కాబట్టి బెట్టింగ్ కంటే జీవితాన్ని ప్రేమించి, కుటుంబాన్ని కాపాడుకోవాలని ఎస్పీ పిలుపునిచ్చారు. క్రికెట్‌ను కేవలం క్రీడగా ఆస్వాదించాలని, అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించే ప్రయత్నాలకు దూరంగా ఉండాలని సూచించారు.
అధిక లాభాల ఆశతో బెట్టింగ్ మాఫియా వలలో పడకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ, మోసపోయిన వారు ఫిర్యాదు చేస్తే నిందితులపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. సమాచారం అందించిన వారి గోప్యతను కాపాడుతామని హామీ ఇచ్చారు.
జిల్లాలో ఎవరైనా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు లేదా ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం ఉంటే వెంటనే డయల్ 112 లేదా చిత్తూరు పోలీస్ వాట్సాప్ నంబర్ 9440900005 ద్వారా లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని ప్రజలకు సూచించారు.
