అర్థగిరి ఆలయ అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక

అర్థగిరి ఆలయ అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక

ప్రతి 15 రోజులకు సమీక్ష సమావేశం
జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశం

చిత్తూరు, ఆంధ్రప్రభ : అర్థగిరి ఆలయ అభివృద్ధికి సంబంధించి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు అర్థగిరిని ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు.

గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తవణంపల్లి మండలంలోని అర్థగిరి ఆలయాన్ని సందర్శించారు. యాదగిరి వీరాంజనేయ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అభివృద్ధిపై ఆలయ బోర్డు సభ్యులు, దేవాదాయ శాఖ, పర్యాటక శాఖ, డ్వామా, అటవీ శాఖ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై విస్తృతంగా చర్చించారు.

సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రికి సమర్పించిన వినతిపత్రంలో ఆలయ పరిసరాల్లో టాయిలెట్ బ్లాకులు, టూ కాంప్లెక్స్‌లు, అన్నదాన సత్రం, ప్లాంట్స్ పార్క్ తదితర అభివృద్ధి పనులు చేపట్టాలని కోరినట్లు తెలిపారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సమాచారం అందడంతో సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

అభివృద్ధి పనులను ఏ విధంగా అమలు చేయాలి, ఏ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలి, నిధుల వినియోగం ఎలా ఉండాలి, కార్యాచరణ ప్రణాళికను ఎలా రూపొందించాలి వంటి అంశాలపై అధికారులతో సమగ్రంగా చర్చించినట్లు తెలిపారు. భక్తులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని సూచించారు.

అటవీ శాఖతో సమన్వయం చేసుకుంటూ అన్ని శాఖల అధికారులు కలిసి సమిష్టిగా పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. అభివృద్ధి పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్ష సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. అలాగే జూన్ 15వ తేదీ నాటికి మరోసారి అన్ని శాఖల అధికారులు సమావేశమై అభివృద్ధి పనుల అమలుపై తుది నిర్ణయం తీసుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

అర్థగిరి ఆలయాన్ని భక్తులకు మరింత సౌకర్యవంతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా, పర్యాటకులను ఆకర్షించే ప్రాంతంగా అభివృద్ధి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.

ఈ సమావేశంలో అర్థగిరి బోర్డు సభ్యులతో పాటు పంచాయతీరాజ్ శాఖ ఎస్.ఈ చంద్రశేఖర్, డ్వామా పీడీ రవికుమార్, టూరిజం అధికారి నరేంద్ర, ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ కే. చిట్టెమ్మ తదితర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply