ప్రభుత్వ ఆసుపత్రిపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

ప్రభుత్వ ఆసుపత్రిపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

రోగులకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం
కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్

శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : స్థానిక ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని శనివారం జిల్లా కలెక్టర్ ఎ.శ్యాం ప్రసాద్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలిస్తూ, రోగులకు అందుతున్న వైద్య సేవల నాణ్యతపై ప్రత్యక్షంగా ఆరా తీశారు. ఓపి (OP) విభాగం, ఐపి (IP) వార్డులను సందర్శించిన కలెక్టర్ రోగులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

ఆసుపత్రిలో మందుల కొరత లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రి ప్రాంగణం, వార్డులు పరిశుభ్రంగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని, పారిశుధ్య నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు. వైద్యులు, సిబ్బంది బయోమెట్రిక్ హాజరును పరిశీలించిన కలెక్టర్, విధి నిర్వహణలో సమయపాలన పాటించాలని సూచించారు. అలాగే స్కానింగ్, ల్యాబ్ పరీక్షలు సకాలంలో నిర్వహించి నివేదికలు త్వరగా అందించాలని ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్యం అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఇందులో ఎటువంటి లోపాలు ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. ఈ తనిఖీలో డీసీహెచ్‌ఎస్ అధికారి మధుసూధన్, ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్యులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.