CM Chandrababu | రైతుల సహకారంతో రాజధాని నిర్మాణం

CM Chandrababu | రైతుల సహకారంతో రాజధాని నిర్మాణం

CM Chandrababu | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌కు శాశ్వత రాజధానిగా అమరావతిని ప్రకటించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతికి చట్టబద్ధ హోదా కల్పించేందుకు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

విభజన చట్టంలోని సెక్షన్ 5లో సబ్ సెక్షన్ 2లో “అట్ అమరావతి” అనే పదాన్ని చేర్చాలని ఈ తీర్మానం ఉద్దేశ్యంగా ఉందని సీఎం వెల్లడించారు. ఈ అంశంపై సభలో సుమారు నాలుగు గంటలపాటు విస్తృత చర్చ జరగనుంది.

ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ….. ఏపీసీఆర్డీఏ చట్టం పరిధిలో గుర్తించిన రాజధాని ప్రాంతాలకు చట్టబద్ధత ఇవ్వడానికి ఈ సవరణ అవసరమని తెలిపారు. 2014లోనే అమరావతిని రాజధానిగా నిర్ణయించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

విజయవాడ–గుంటూరు మధ్యలో ఉన్న ప్రదేశం రవాణా సౌకర్యాల దృష్ట్యా అనుకూలంగా ఉండటంతో, అమరావతిని సమగ్ర రాజధానిగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగిందని పేర్కొన్నారు. రాజధాని నిర్మాణం కోసం సుమారు 29 వేల మంది రైతులు 30 వేల ఎకరాలకు పైగా భూములు స్వచ్ఛందంగా ఇచ్చారని, వారికి ల్యాండ్ పూలింగ్ ద్వారా నివాస, వాణిజ్య స్థలాలతో పాటు వార్షిక కౌలు అందించే విధానం అమలు చేశామని వివరించారు.

అయితే 2019లో మూడు రాజధానుల ప్రతిపాదనతో అమరావతి అభివృద్ధికి అంతరాయం కలిగిందని విమర్శించారు. ఇప్పుడు మళ్లీ అమరావతిని చట్టబద్ధంగా రాజధానిగా స్థిరపరిచే అవకాశం లభించిందని తెలిపారు.

Leave a Reply