ఎండల తీవ్రతపై అప్రమత్తం…

ఎండల తీవ్రతపై అప్రమత్తం…
పాఠశాలలకు జిల్లా
విద్యాశాఖాధికారి కీలక ఆదేశాలు
నిజామాబాద్ స్పోర్ట్స్, (ఆంధ్రప్రభ): వేసవి కాలంలో తీవ్ర వేడి గాలులు ప్రభావం, ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి పి అశోక్ ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ స్టేట్ హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్–2026 అమలు నేపథ్యంలో ఈ సూచనలు అందించినట్లు తెలిపారు. జిల్లాలోని మండల విద్యాధికారులు, అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తప్పనిసరిగా క్రింది చర్యలు అమలు చేయాలని సూచించారు. అన్ని తరగతి గదుల్లో నిరంతర విద్యుత్ సరఫరా, ఫ్యాన్ సౌకర్యం కల్పించాలనీ కోరారు.
విద్యార్థులు టోపీలు, సడలైన పత్తి దుస్తులు ధరించడం, నీటి సీసాలు, ORS ప్యాకెట్లు, గొడుగులు వెంట తీసుకురావాలని సూచించాలని పేర్కొన్నారు. హీట్‌కు సంబంధించిన అనారోగ్య లక్షణాలను పిల్లలకు వివరించి, అవసరమైతే వెంటనే చికిత్స అందించాలనీ తెలిపారు. అన్ని పాఠశాలల్లో తాగునీరు, ORS ప్యాకెట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు సమృద్ధిగా ఏర్పాటు చేయాలనీ అన్నారు. ఈ చర్యలను మండల విద్యాధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కచ్చితంగా అమలు చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి స్పష్టం చేశారు. ఆదేశాలు అందినట్లు ధృవీకరించి, అమలుపై నివేదికలు పంపాలని సూచించారు.
