ఆన్‌లైన్ ఫార్మసీల రద్దుకు డిమాండ్

ఆన్‌లైన్ ఫార్మసీల రద్దుకు డిమాండ్

  • ఈ నెల 20న దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్

కమ్మర్‌పల్లి, ఆంధ్రప్రభ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ-ఫార్మసీ (ఆన్‌లైన్ మందుల విక్రయాలు) విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 20వ తేదీన దేశవ్యాప్తంగా మెడికల్‌ షాపుల బంద్‌ను నిర్వహిస్తున్నట్లు కెమిస్ట్‌ అండ్‌ డ్రగ్గిస్ట్‌ మెడికల్ అసోసియేషన్ మండల అధ్యక్షుడు అల్గోట్ రమేష్ పేర్కొన్నారు. ఈ బంద్ పిలుపులో భాగంగా సోమవారం కమ్మర్‌పల్లి మండల తహసీల్దార్ ఎం. నరేష్‌కు, స్థానిక ఎస్సై జి. అనిల్ రెడ్డికి మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు విడివిడిగా వినతిపత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు అల్గోట్ రమేష్ మాట్లాడుతూ.. ఆన్‌లైన్ ద్వారా సాగుతున్న ఈ-ఫార్మసీ విక్రయాల వల్ల నకిలీ ప్రిస్క్రిప్షన్లతో (వైద్యుల చీటీలు) మందులు పొందే అవకాశం పెరిగిందని, దీనివల్ల ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా (కోవిడ్-19) కష్టకాలంలో ఆన్‌లైన్ మందుల సరఫరాకు తాత్కాలికంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను, ఆదేశాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ప్రజల ప్రాణాలను, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్ మందుల సరఫరా విధానాన్ని పూర్తిగా నిలిపివేయాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పిలుపు మేరకు ఒక్క రోజు పాటు మెడికల్ షాపులను పూర్తిగా బంద్ చేసి నిరసన తెలియజేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

ఈ వినతిపత్రాల సమర్పణ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి శ్రీనివాస్, జిల్లా సలహాదారు అన్నం గణపతి రామ్, ముఖ్య సభ్యులు బోగ రామస్వామి, గుడ్ల నవీన్, సాయి చరణ్, దామోదర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply