దేశ భక్తికి ప్రతిరూపం భగత్‌సింగ్‌

దేశ భక్తికి ప్రతిరూపం భగత్‌సింగ్‌

భ‌గ‌త్ సింగ్ ఆశ‌య సాధ‌న‌కోసం కృషి చేయాలి
AIYF రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి CPI సుభాని

చిలకలూరిపేట టౌన్, ఆంద్రప్రభ : రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన భగత్ సింగ్ ఆశ‌య సాధ‌న‌కు యువ‌త కృషి చేయాల‌ని సీసీఐ ఏరియా కార్య‌ద‌ర్శి తాళ్లూరి బాబురావు చెప్పారు. స‌ర్దార్ భ‌గ‌త్ సింగ్ వ‌ర్ధంతిని సోమ‌వారం ప‌ట్ణణంలోని సీపీఐ కార్యాల‌యంలో ఘ‌నంగా నిర్వ‌హించారు. ముందుగా ఆయ‌న చిత్ర ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ భగత్ సింగ్ జీవిత చరిత్రను ‌పాఠ్య పుస్తకాల్లో నుంచి పూర్తిగా తొలగించడం కోసం కంకణం కట్టుకుందన్నారు.

గల్లీస్థాయిలో కూడా త్యాగాలు చేయనివాళ్లను ఢిల్లీ స్థాయిలో ప్రచారం చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. భగత్ సింగ్ లాంటివారి చరిత్రలను ప్రచారం చేయడానికి పాలక ప్రభుత్వాలు జంకుతున్న‌ట్లు చెప్పారు. భగత్ సింగ్ ఆశయ సాధన కోసం విద్యార్థులు, యువకులు ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మతాలు, కులాల మధ్య చిచ్చు పెడుతూ తమ రాజకీయ పబ్బం గడుపుకుంటోందని విమర్శించారు. ప్రపంచంలో అమెరికా- ఇజ్రాయిల్‌ కలిసి ఇరాన్‌ మీద పెద్దఎత్తున యుద్ధం చేస్తూ మారణ హోమం సృష్టిస్తున్నాయని అన్నారు.

యుద్ధం విషయంలో మన దేశ ప్రధానమంత్రి మోడీ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర ఆర్గ‌నైజింగ్ సెక్ర‌ట‌రీ షేక్ సుభాని మాట్లాడుతూ… స్వాతంత్ర్యం కోసం 23 ఏళ్ల వయస్సులోనే భగత్ సింగ్ తన ప్రాణాలను తృణప్రాయంగా విడిచిపెట్టారని అన్నారు. ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ భగత్ సింగ్ ఇచ్చిన నినాదం ఇప్పటికీ వేల గొంతుల స్వరంగా మారు మోగుతోందని వివరించారు.

ప్రజా భద్రత చట్టం, పారిశ్రామిక వ్యవహారాల చట్టాలు రెండూ ఆనాడు ప్రజా ఉద్యమాలను అణచివేయడానికి వచ్చాయని, వాటికి నిరసనగా భగత్‌ సింగ్‌ పార్లమెంటులో పొగబాంబు విసిరాడని గుర్తు చేశారు.దేశ భక్తికి అసలు ప్రతిరూపం భగత్‌సింగ్‌ అని నేటి తరం యువత భగత్‌సింగ్‌ ఆశయ సాధనకు పాటు పాడాలని కోరారు. కార్య‌క్ర‌మంలో AIYF ఏరియా కార్యదర్శి కె మల్లికార్జున్,నాయకులు పృథ్వీ, అనిల్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.