ఘనంగా ఉగాది మహోత్సవాలు… చివరి రోజు విశేష పూజలు

ఘనంగా ఉగాది మహోత్సవాలు… చివరి రోజు విశేష పూజలు

నంద్యాల, నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలో జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలంలోని శ్రీ భ్రమరామృతం మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఉగాది మహోత్సవాల చివరి రోజు శుక్రవారం శ్రీ స్వామిఅమ్మవారికి విశేష పూజలు నిర్వహించబడ్డాయని కార్యనిర్వాహణాధికారి శ్రీనివాసరావు తెలిపారు. యాగశాలలో శ్రీ చండీశ్వర స్వామికి ప్రత్యేక పూజాదికాలు జరపబడ్డాయి. అనంతరం లోకకల్యాణం కోసం జపాలు, నిత్యహోమ బలిహరణలు, హోమాలు నిర్వహించబడ్డాయి.

తదుపరి యాగపూర్ణాహుతి, వసంతోత్సవం, అవభృథం కార్యక్రమాలు జరిపించబడ్డాయి.

పూర్ణాహుతి ప్రత్యేక కార్యక్రమం:
శ్రీ అమ్మవారికి మల్లికార్జున స్వామి పూర్ణాహుతి కార్యక్రమంలో శాస్త్రోక్తంగా నారికేళాలు, సుగంధద్రవ్యాలు, ముత్యం, పగడం, నూతన వస్త్రాలు మొదలైన ద్రవ్యాలను హోమగుండంలో ఆహుతిగా సమర్పించి యాగకార్యక్రమాన్ని పూర్తి చేశారు.

వసంతోత్సవం:
పూర్ణాహుతి అనంతరం వసంతోత్సవం జరిగింది. కార్యక్రమంలో స్థానాచార్యులు అధ్యాపక వసంతాన్ని పసుపు, సున్నం, సుగంధద్రవ్యాలతో మంత్రపూరిత జలంగా భక్తులపై ప్రోక్షించారు.

అవభృథం – త్రిశూలస్నానం:
వసంతోత్సవం తర్వాత చండీశ్వరస్వామివారిని మల్లికాగుండంలోకి ఆలయ ప్రాకార ప్రదక్షిణతో పల్లకీలో తోడ్కొని, అక్కడ అవభృథం జరిపించారు. ఈ అవభృథంలో శుద్ధజలం, పంచామృతం, భస్మోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం, సుగంధోదకం, బిల్వోదకం, పుష్పోదకం, నారికేళోదకం మొదలైన వాటితో స్నాన కార్యక్రమం నిర్వహించబడింది.

తరువాత మల్లికాగుండంలో త్రిశూలస్నాన కార్యక్రమం జరిగింది. మల్లికాగుండ జలాన్ని తలపై ప్రోక్షించడం ద్వారా పాపాలన్నీ నశించి శ్రేయస్సు కలుగుతుందని చెప్పబడుతోంది.

అశ్వవాహన సేవ:
ఉగాది ఉత్సవాల్లో భాగంగా శ్రీ స్వామిఅమ్మవారి ఉత్సవమూర్తులను అశ్వవాహనంపై వేంచేబు చేసి ప్రత్యేక పూజాదికాలు నిర్వహించబడ్డాయి. అశ్వవాహనాధీశులైన శ్రీ స్వామిఅమ్మవార్లను దర్శించడం ద్వారా సమస్యలు తీరిపోతాయని, సంతానార్థులకు సంతానం కలుగుతుందని విశ్వసనీయంగా చెప్పబడింది.

నిజాలంకరణ:
ఉగాది మహోత్సవాల్లో భాగంగా సాయంకాలం శ్రీ అమ్మవారి ఉత్సవమూర్తిని భ్రమరాంబాదేవి నిజాలంకరణలో అలంకరించారు. అష్టభుజాలను కలిగిన ఈ దేవి శూలం, బాకు, గద, ఖడ్గం, విల్లు, డాలు, పరిఘం మొదలైన ఆయుధాలను ధరించి జగన్మాతగా దర్శనమిస్తుంది. అమ్మవారి నిజాలంకరణ దర్శనం ద్వారా సమస్యలన్నీ తొలగిపోగా, సకల శుభాలు కలుగుతాయని విశ్వసనీయంగా చెప్పబడింది.

పూజాదికాల అనంతరం ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణా చేసి ఉత్సవమూర్తులకు ఆలయ ఉత్సవం నిర్వహించబడింది. ఆలయ ఉత్సవంతో ఉగాది ఉత్సవాలు ఘనంగా ముగిసాయి. కార్యక్రమంలో కార్యనిర్వాహణాధికారి, అర్చక స్వాములు, ధర్మకర్తల మండల సభ్యులు, వేద పండితులు, పలువురు అధికారులు పాల్గొన్నారు.